పుట:Rangun Rowdy Drama.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

రంగూన్‌రౌడీ.

ప్రభా - అదెమో! నే నెఱుఁగను గాని ఆదినుండియు మీజాతి కట్టి బిరుదము.

శంక - ఊహించిచూడ నా కొక్క హేతువు గోచరించుచున్నది. ప్రాయశః అదియే వాస్తవమైనను గావచ్చును.

ప్రభా - ఏ దాహేతువు ?

శంక - కాకినాడసమీపమున కోరంగి యను నొకపల్లెటూరు కలదు. ఆరంభమున విశేషజనులు కూలిపనులకై కోరంగిగ్రామమునుండి వచ్చియుందురు. ఇచ్చటివారు మీ దేయూరని యడిగిన "కోరం గి” యని చెప్పియుందురు. ఆనాఁటినుండియు నెచ్చటనుండి యాంధ్రుఁడు వచ్చినను, కోరంగివాఁ డని పిలుచుటయే ఆచారముగ మాఱియుండును.

ప్రభా - అదే నిజమై యుండును. ఇప్పుడు ఈక్షోభయంతయు మన కెందులకు గాని, శంకరరావూ ! నీ వనినట్లు మీజాతియందు కూలివాండ్రు నాగరకత లేనివారే గాని అందఱకు నొకేవిధమగు నపకీర్తిని గల్గించుట యన్యాయమని నా కిపుడు దోఁచుచున్నది సుమా!

శంక - ప్రభావతీదేవీ ! ఎందుచేత ?

ప్రభా - ఎందుచేత నననేల ? అందులకు కోటిమన్మథాకారసమాన మైన నీముఖమండలమే ప్రబలతార్కాణమై యుండలేదా ?

శంక - (నవ్వి) అట్లనా ! నాముఖ మెట్లు మీకుఁ గనఁబడుచున్నది.

ప్రభా - ఎట్లా? చెప్పు మందవా ?

ఉ. అంగజమోహనంబగు మహత్తరతావకరూపరాశి, క
     న్నుంగవఁ దోఁచినంతనె మహోజ్జ్వలమారశరాగ్నికీల నా
     యంగము సర్వమున్ దహనమందగఁజేసె ననంగ నింక నీ
     యంగవిలాస మెట్లు తెలియంగల నీగతిఁ గాక వేఱుగన్.