పుట:Rangun Rowdy Drama.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాంకము.

35

      అన్నిజాతుల కాలిపన్నాలదెబ్బల
                   శ్రమ కోర్చువారు కోరంగివారు
      మానంబు వోనాడి మలమూత్రములను శు
                   భ్రముచేయువారు కోరంగివారు

     కొట్టినను తిట్టిన సహించి, గొడ్లవోలె
     లొంగియుండు బానిసలు కోరంగివారు
     నాగరకతయు, దేహసౌందర్యగరిమ
     యుం గలుగనట్టివారు కోరంగివారు.

శంక - హరి హరీ ! ఈపాపపుచెవులతో నెట్టిమాటలు వినుచున్నాను! ప్రభావతీదేవీ ! ఎట్టిగౌరవనీయ మైనజాతి కీనగరమునం దెట్టిదుర్గతి గలిగినదో తలంచినకొలదియు గుండెలు వ్రీలిపోవుచున్నవి.

సీ. ఆందోళికలనెక్కు- నాంధ్రజాతికి నేఁడు
                 [1]లంచాల నీడ్చుకాలంబు వచ్చె
    అవనిఁ బాలించిన యాంధ్రజాతికి నేఁడు
                 కూలిచే జీవించు గోఁడువచ్చె
    అతిశౌర్యవంతమౌ నాంధ్రజాతికి నేడు
                [2]పన్నాలదెబ్బల పాట్లు వచ్చె
    అధికగౌరవనీయ మాంధ్రజాతికి నేఁ డ
                శుద్ధంబు తుడిచెడి క్షోభ వచ్చె

    అసమసాధ్వీత్వంబున కీర్తినందినట్టి
    యాంధ్రజాతికి లంజలౌ నపయశస్సు
    వచ్చె; నాగరకత గల్గువారి కిపుడు
    మోటువారను కట్టడిమాటవచ్చె.

అన్నిటిమాట యట్టుండగా నీకోరంగియను బిరుద మెక్కడి నుండి దాపురించెనా యని

నాకాశ్చర్యముగా నున్నది.

  1. లంచా = రిక్షాబండి.
  2. పన్నా = కర్రపాదరక్ష,