పుట:Rangun Rowdy Drama.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము.

27

అన్న -- జనకా ! అల్లుఁడు హంతకుఁడే కావచ్చును. అంతమాత్రమున మీగర్భమున జనించినయేక పుత్రికనైన నాబ్రదుకును పదటఁ గలుప సిద్ధమగుటకు మీ అంతరాత్మ యంగీకరించునా ?

తుల - అమ్మాయీ! నే నేమి చేయుదును ? ఇది యనివార్యనిబంధనా సహితమైన సర్కారువిధి యని నీవుమాత్ర మెఱుంగవా? దానిం దప్పి నేను దోషము నొడిగట్టుకొందునా ?

అన్న - తండ్రీ ! నీకు కేవలము ఉద్యోగధర్మమే ముఖ్యమా ! పుత్రిక యందు వాత్సల్యముగాని, జమాతయందు నానుభూతిగాని యక్కఱలేదా ! నాకు కష్టము వచ్చినచో - అది నాతండ్రివగు నీకుమాత్రముగాదా ! నాపసుపుకుంకుమను నట్టేటఁగలిపెదవా! తండ్రివగునీవు నాకు చేయు దాన మిదియేనా? కన్నవాఁడవు నీపు గలవని గంపెడాశతోనున్న నాకింక గతియేమి ? జనకా! నీ పాదములపైఁబడి వేడుకొందును. అల్లుని క్షమించి ఆత్మజనగు నన్నుఁ గరుణింపుము. ఉద్యోగధర్మము నే పట్టుకొని యూగులాడుట నీకు తగదు. నాకు పతిభిక్ష దయసేయుము.

సీ. తొడపైనఁజేర్చి ముద్దులనాడి, నను సాది
                నట్టివాత్సల్య మేమయ్యె నయ్య ?
    ఘనమైన యరణంబుల నొసంగి నా పెండ్లి
                సలిపినకృప యెందు సమసె నయ్య ?
    'అల్లుఁడా ! ర'మ్మని యాదరించిన కృపా
                పరత యంతయును నెం దరిగె నయ్య?
    కోరిన దెల్లను కొసరులేకుండ దీ
                ర్చినప్రేమ యేమూలఁ జేరె నయ్య ?

    తుదకు నుద్యోగ మొకటి హేతువుగఁ జెప్పి
    తనయగొంతుకఁ గోయుట తగునటయ్య ?