పుట:Rangun Rowdy Drama.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

రంగూన్‌రౌడీ.

అన్న -- (తలకొట్టుకొని) ఈదిక్కుమాలినమధుపానభూత మెప్పు డావేశించినదో అప్పుడే ఇంతదారుణ మేనాఁడైన జరగుననుకొంటిని ! పరమేశ్వరా ! ఇం కేదిదారి ?

(తులసీరావుతో గంగారాం ప్రవేశము.)

తుల - ఏఁడీ ! ఆహంతకుఁ డెక్కడ ?

అన్న -- (స్వగ) శ్రీరామరామ! పోలీసుపనియందున్న పాపమున నాతండ్రికే అల్లునిబంధించుకార్యము నప్పగించిరికాఁబోలును! నాతండ్రి ఉద్యోగధర్మమున దయాధర్మములుగాని, బంధు వాత్సల్యమును గాని తలంచనివాఁడు. అల్లుఁడైనమాత్రమున క్షమించునా ?

గంగా - అయ్యా! ఇదేశంకరరావుగృహము! ఉండిన నిందేయుండవలెను.

అన్న - నాయనగారూ ! ఇది యేమిగంద్రగోళము !

తుల - అమ్మాయీ ! ఇప్పుడు నీబాంధవ్యముతో నాకు సంబంధము లేదు. నేను పోలీసుసూపరింటు డెంటును. నాకర్తవ్యమును నేను నెఱవేర్చుకొననైతినేని నామర్యాద దక్కదు.

అన్న - పోనిండు.అదియట్లేకావచ్చును. ఇంతకునుజరిగినవ్యవహారమేమి?

తుల - నీభర్తయగు శంకరరావు రంగారావును చంపినద్రోహమున నిప్పుడు హంతకుఁడై యున్నాఁడు. అతఁడీయింటనున్నట్లు మా కనుమానముగా నున్నది ! మర్యాదగా చూపెదవా ? మమ్ము సోదాచేసికొ మ్మందువా

అన్న - నాన్నగారూ ! సోదా చేసికొనుటకేమి ! అదియొక విషయముగాదు. చేసికొనవచ్చునుగాని, నే నడుగుప్రశ్నకు దయతోనుత్తర మిచ్చెదరా ?

తుల - అమ్మా ! ఇప్పుడు ప్రశ్నల కుత్తరమిచ్చుటకు సావకాశమును లేదు. ఇది సమయమును గాదు. కాని సూక్ష్మముగ తెమల్చితివా చెప్పినపిమ్మట నావిధ్యు క్తకార్యమునఁ బ్రవేశింతును.