పుట:Rangun Rowdy Drama.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము.

25

సీ. వరగుణోపేతుఁడౌ ప్రాణనాయకుఁ డిట్లు
              హీనదుష్కీర్తి వహించుటేమి ?
    సానులతోడను సారాయితోఁగూడి
              యుండి, గృహము చేరకుండుటేమి ?
     జనకుని మరణమే సంతోషమని పొంగి
              యంచితధనము వెచ్చించుటేమి ?
     చావగాఁచిన వృద్ధజననికైనను నొక్క
              పిండమైన నొసంగకుండుటేమి ?

     సుతుని, భార్యను నీగతి వెతల ముంచి
     వేశ్యయే లోక మని విఱ్ఱవీగుటేమి ?
      కటకటా ! ఇదియెల్ల దుష్కాలమహిమ
      గాక యుండిన నీస్థితిగలుగుటేమి ?

[శంకరరావు-ప్రవేశము.]

శంక - పోలీసులు - పోలీసులు - పోలీసులు. నన్ను వెంబడించుచున్నారు ? ప్రాణేశ్వరీ ! అన్నపూర్ణా ! ఇక నా కేది గతి ? నే నెట కేగుదును?

అన్న - అది యేమి? అది యేమి? పోలీసు లేల మీవెంటఁ బడిరి ? ఏమి ద్రోహము చేసినారు ?

శంక -- ఖూనీ చేసితిని. ఖూనీ ---

అన్న — అమ్మయ్యో ! ఖూనీయే చేసినారా ! ఎవరిని ? ఎవరిని ?

శంక - ముసలిరంగారావును ఖూనీచేసితిని ! మాటల కెడములేదు. నా బుద్ధికిప్పుడు ఆలోచన శక్తిపోయినది. నా కేదైనమార్గముచూపుము.

అన్న -- సరే ! జరిగిన దేదో జరిగినది. ఈగదిలో దాగియుండుఁడు. తరువాతసంగతిఁ జూచుకొందము.

శంక - (ఒక గదిలోనికిఁ బోవును.)