పుట:Rangun Rowdy Drama.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము.

21

నాంది — మీ రెవ్వరమ్మా ! సందులో నేమిచేయుచున్నారు ?

దాసి - నేను సేటుసాహేబుగారి సర్వెంటును.

నాంది - సర్వెంటూ ? సర్వెం టంటే ఏమిటీ ?

దాసి - సర్వెం టనగా తెలియనే తెలియదా ? సర్వెం టనఁగా ! "దాసి" అన్నమాట.

నాంది - నీవు దాసివా ! అబ్బో! ఇంగ్లీషుదాసివా యేమి ?

దాసి - -ఆఁ ! అన్నమాటే .

నాంది --- అబ్బో! అట్లయిన నీకు చాకిరిచేయుటకన్న మాపై సవారీచేయుట బాగుగాతెలియునని తోఁచుచున్న దే?

దాసి - నీ కా అనవసరప్రసంగ మెందుకు? నాతో నేమైన పని యున్నదా చెప్పు, లేదా వెళ్ళెదను.

నాంది - నీవు దాసివైన నే నెవ్వతెనో తెలియునా ?

దాసి - ఏమో ! ఎవ్వతెవో.

నాంది - నీవుదాసివైనచో నే నీఇంటి “సేఠాణీ”ని.

దాసి - ఏమో ! సేఠాణీవో సైతానీవో ! నాకుఁ దెలియదు. అసలు పనియున్నదా?

నాంది — (స్వగతం) దీనిమాటలు - దీనివైఖరి చూడఁగా కొంపకు మారివలె వచ్చిన ట్లున్నది. ఇది గంగారాంసేట్‌కంటఁబడెనా నాకుఁ దక్కఁడు. కనుక - దీని నాతనికంటఁబడనీయకూడదు. ( ప్రకాశముగా ) అమ్మాయీ ! ఉండుండు. తొందరపడియెద వెందులకు ! నీవు బజారునకు వెళ్ళి రెండణాలు చేపలు, రెండు డబ్బుల ఉల్లిపాయలు, కాని చింతపండు, కాని పచ్చిమిరపకాయలు-

దాసి - ఉండుండు. నేను సంతబజారుసకు వెళ్ళి సామానులు తెచ్చు దాసిముండ ననుకొన్నావా ?