పుట:Rangun Rowdy Drama.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము.

13

నీ వాగ్రహము చూపిన లాభములేదు. ఆఱునెలలు సాముచేసి మూలనున్న ముసలిముండను పొడిచెనన్నట్లు నీప్రతాపమంతయుఁ జూపుట కీమెయా దొఱికినది ! చేరదీసిన వేశ్యముందరనా చిందులు ద్రొక్కెదవు. ఇది నీ కొకఘనము కాదు. నాకును వదినెకును కూడుపెట్టకున్న మానె. గుమ్మమున కొక కబళము భిక్ష మెత్తుకొనియో, సజ్జనులగువారి యెవరియింటనైన చాకిరి చేసికొనియో బ్రదుకఁగలము. పెద్దవాఁడై చేతి కందినపిదప నీ కుమారుఁడే తల్లికి దిక్కగును. కాని జవసత్త్వములు లేక చావసిద్ధముగానున్న యీముదుసలి దానికి మాత్రము దిక్కు చూపుము. ఈమెను పోషించుట నీవుకాల్చుచున్న సిగరెట్లు మాత్రపు విలువయైనఁ గాఁజాలదు. లోకనింద నేల తలకు చుట్టుకొందువు ? సోదరా ! నామనవి వినుము.

గిరి - చూడండి ! న న్నెన్నిమాట లాడుచున్నారో! నే నీదుర్భాషలను వినలేను. లోనికి పోవుదును. (పోఁబోవును.)

శంక -- ఆఁ ! ఆఁ ! వలదు; వలదు. నీకు గోపమువచ్చిన నేను బ్రదుకఁ గలనా ? ని నెవ్వ రేమనఁగలరు ? నిలువుము.

తల్లి -ఎంత వగలమారి వంకాయవే - గయ్యాళిగంపా !

జాన - అమ్మా ! నీ కేమి మతి పోయినదా ! మనగ్రహచారమున కేడ్వవలసినదేగాని ఒకరి ననఁదగినయధికారము మన కెక్కడిది? మనబంగారము మంచిదైన కంసాలి యేమిచేయఁగలఁడు !

శంక - అమ్మాయీ ! విశేషముగ మీరందఱును నాతో వాదించిన కొలఁదియు నాశరీరము మండుకొనిపోవుచున్నది. తుదిమాట చెప్పెదను. నా నిశ్చయమును విని మీ రిటనుండివెడలిపొండు.

ఆ. తల్లి లేదు నాకు; చెల్లెలు లేదింక,

భార్య లేదు; పుత్రవరుఁడు లేఁడు;