పుట:Rangun Rowdy Drama.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము.

7

జయ - అకవిత్వమంతయు నాబుఱ్ఱలో లేదు. నీ మొగములో నున్నది. నీ మొగము చూడగనే నా కీకవిత్వము పుట్టుచుండును.

(అనుబంధము - 4)

[గంగారాంసేట్ ప్రవేశము.]

గంగా - (చూచి అసహ్యపడి) అరే బాప్ రే బాప్- చొకిడీకాప్యార్ ఘర్ కాలాచార్ ఈజయరాం ముండకొడుకు ఇన్నాళ్ళకు నా చేతఁబడినాఁడు. చేతఁబడ్డ వీనిని చెప్పుదెబ్బలతోఁగాని సాగనంపను. కానీ, వీనిసరసము నీచాటునుండి కనిపెట్టెదను.

(చాటుననుండును.)

రాధా -- ప్రియా ! మీచేతియందలి గ్రంధ మేమి ?

జయ -- ఇదియా! ఇది యొక నాటకము.

రాధా - మీరు వ్రాసినదేనా ?

జయ - మఱియొకరు వ్రాసినదానిని మాగ్రంధ మని చెప్పుకొనుటకు మాయచేసి బ్రతుకు మైరావణ కవి ననుకొంటివా యేమి ?

గంగా - గతిలేక వీఁ డీనడుమ కవిత్వముకూడ నేర్చినాఁడా? సరి. అట్లయిన పద్యలక్షణమును నేర్పినగురువునకు పంగనామములు పెట్టినాఁ డన్నమాటే.

రాధా - అట్లయిన నీగ్రంధము పేరేమి ?

జయ - గంగారామసంహారము !

గంగ - (ఉలికిపడి) ఏమీ ! నాసంహారమా ?

రాధా - ఇది యేమి ! నాతండ్రిని సంహరించు నాటకమా?

జయ - ఔను ! నీతండ్రినే.

రాధా -- అయ్యో ! అంతదారుణము చేయుదురా ?

జయ -- వెఱ్ఱిదానా! గ్రంధనామము విన్నంతనే గాభరా పడెద వేమి ? ఇది వట్టికథమాత్రమేకదా ? అంతమాత్రమునకే భయమేల ?