పుట:Rangun Rowdy Drama.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

రంగూన్‌రౌడీ.

దిరిగినంతమాత్రమున నామదికిఁ బ్రమోదమగునని తలంచితివా? అనాథనైన నా యాభరణసహస్ర మానందముం గూర్చు నని నమ్మితివా ? చూచి యానంది.పవలసిన ప్రాణేశ్వరునికంటికి హేయమైపోయిన, యీదేహసౌందర్యమేల? కాల్పనా? లక్ష్మీ! ఈ ప్రపంచమున నాకన్న నభాగినులొక్కరైనఁ గలరా ?

లక్ష్మీ - అమ్మా ! కన్నీరు తుడుచుకొనుము. బాబుగారు మీయందన్యబుద్ధిగలవారైనను, భగవత్ప్రసాదమున బంగారమువంటి పుత్రరత్నము కలిగినాఁడు.

అన్న - (బాలు నెత్తికొని ముద్దాడుచు) నాయనా ! నాభాగ్యరాశీ ! నీ వెట్టి దుష్టనక్షత్రమునఁ బ్రభవించితివిరా !

గీ. బాల ! సుకుమార ! నా గ్రహకాలమహిమ
    వక్రగతినంద, నీఫాలభాగ్య రేఖ
    యైన శుభపరిణామంబు నందరాదె ?
    ధరణిపై భాగ్యహీను లిద్దఱము మనమె.

లక్ష్మి - ( తెరవంకఁజూచి) అమ్మా! అమ్మా! బాబుగారు వచ్చుచున్నారు.

అన్న — (చూచి భయముతో) అమ్మయ్యో ! త్రాగి వచ్చుచున్న ట్లున్నారు. ఇది యేమిభయంకరాకారము ! దైవమా! ఈ దిక్కుమాలిన మధుపానభూతమునకు, నానాధు నేల దాసునిఁ గావించితివి ? దాసీ ! కుఱ్ఱవాని నెత్తికొని లోని కరుగుము.

లక్ష్మి - నీయానతి ప్రకారము (బాలునితో నిష్క్రమించును.)

[త్రాగి తూలుచు శంకరరావు ప్రవేశించును.]

అన్న -- (మేలిముసుగు సవరించుకొని ప్రక్కను నిలుచును.)

శంక - (చూచి) ఓహో ! మాలేడీ (Lady) అన్నపూర్ణాదేవిగారు కాఁబోలును ! హిందూస్త్రీలకు పుట్టు పెద్దరోగములలో నిది యొకటి. ముసుగుతగిలించుకొని మూఁడువంకలు తిరుగుట !