పుట:Rangun Rowdy Drama.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

91

జయ - మీ రెఱుగని వుపాయమేమిటీ ! సైతాన్ రాసినవుపాయమే వుపాయం.

గంగా - ఏమిటీ ! జయరాంగాడికి బిడ్డ నివ్వమంటావా ?

జయ - నామనవి అదే! ఏ మంటారా! మీ రిప్పుడు జెయిలునకు వెళ్లతారు. మీకు కావలసినంతధనం ఆ స్త్రీ వున్నాయి. మొన్న మొన్న మీకు పుట్టిన కుఱ్ఱవాఁడూ --

గంగా - నాకు పుట్టలేదోయ్. నాభార్యకు పుట్టినాఁడు. నాందీబాయికి పుట్టాఁడు. అర్థంచేసుకుని మాట్లాడూ !

జయ - అదే అదే ! మీభార్యకు పుట్టినకుఱ్ఱవాఁడే! చిన్నవాఁడు-ఆస్తి అంతా ఆగమైపోతుంది అందుచేత రాధాబాయిని జయరాం కిచ్చి పెళ్ళి చేస్తే ఆస్తిని సంరక్షిస్తాడు. కుటుంబానికి ఆధారమవుతాఁడు.

గంగా - వాడు నాకు శత్రువు గాడటోయ్ దర్సాన్ ! శత్రుఁడికి బిడ్డనిచ్చి సంసారం, ఆస్తి అంతా అప్పగించేదా ?

జయ - అయితే జెయిల్లోకూడా సైతాన్ తప్పదు.

గంగా - అరే దర్వాన్ !

జయ - అరే భగవాన్ !-

గంగా - ఐతే, ఇదే సిస లంటావా ?

జయ - తప్పకుండా--

కృష్ణ - ఎంతసే పీఆలోచన ! జెయిలుకు నడూ !

గంగా - ఉండరా బాబు ! నీతో ఱంకుమొగుడుతద్దినము వచ్చిందీ ! ఆస్తిపాస్తీ అప్పగింతలు పెట్టనీ ! అయితే దర్వాన్ ! మన కా జయరాం యెక్కడ దొరుకుతాడు మరి?

జయ - అదంతా తమ కెందుకూ! కాగితం వ్రాయడంపని తమరు కానివ్వండి. ఇక్క డున్నట్టుగా జయరామ్‌సింగును యీడ్చుకొచ్చే భారము నాది.