పుట:Rangun Rowdy Drama.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మ్రింగుటయు, ప్రభావతీ రమేశుల నావ షికారును, తిమింగిలమును జంపి శంకరరావును రక్షించుటయును శబ్దరహితమగు కేవల నటనముతో బయస్కోపువలె చూపఁబడెను. కేవలము సీనును చూచు నభిలాషతో ప్రేక్షకులు రెండుసారులు సీనునకు “వన్సుమోర్” నిచ్చిరి. ద్వితీయ విశ్రాంతికాలమున రెండు కొండలపై వంతెనయు, క్రింద ప్రవాహమును, ఆ వంతెనపైనుండి ప్రభావతీ శంకరరావులు నడిచిపోవుటయు, శంకరరావు వంతెనను విరుగగొట్టుటయు, తులసీరావు పోలీసులతో వచ్చి రెండవప్రక్కనుండి తుపాకులను ప్రేల్చుటయు, పోలీసు లొక్కరొక్కరుగా కొండపైనుండి క్రిందికి దొరలి కూలుటయు, తులసీరావును ప్రేల్చుటకు శంకరరావు తుపాకిలోని గుండ్లయిపోవుటయు నిశ్శబ్ద నటనా రంగముగాఁ జూపఁబడెను. అట్టి గొప్పసీనులు ఆంధ్రదేశపు జిల్లాలలో ప్రదర్శింపఁ బడినపుడు చూపుట కీ సభవారి కవకాశము కలుగకున్నను, కేవలము సూర్యనారాయణగారి శంకరరావు నటసముతో ప్రేక్షకులను తృప్తి నందింపఁగలిగిరి. ఈ నాటకము నీతిదాయకమైన దని ప్రతివారును గ్రహింపకపోరు. ఇవి విషాదాంతమగుటయే యుక్తమని నా తలంపు. విషాదాంతముగనే ప్రతిసభవారును ప్రదర్శించుచున్నారు. శుభాంతరంగము నీ రెండవ కూర్పునందు విడిచివేయడమైనది.

ఈ నాటకమునఁగల గుణములను పాఠకులు గ్రహించి దోషములను నాకుగాని ప్రకాశకులకుగాని యెఱింగించినయెడల తృతీయముద్రణమున తప్పక సవరించుకొందు నని రసజ్ఞపాఠక మహాశయులకు మనవి చేసికొనుచున్నాను.

ఇట్లు బుధజనవిధేయుఁడు,

సోమరాజు రామానుజరావు,

భద్రాచలము.


_____________