పుట:RangastalaSastramu.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచసంధులు

రెండవ అంకంలో దుష్యంతుని ఇంటికి తిరిగి రమ్మని తల్లి ఆజ్ఞ. శకుంతలా దుష్యంతుల సమ్మేళనానికి అంతరాయము కలిగింది. దుష్యంతుడు తనమీద శకుంతలకు గల అనురాగము వర్ణించడంతో ఆశ స్పష్టమవుతుంది. విదూషకుని రాజధానికి పంపి దుష్యంతుడు తాను కణ్వాశ్రమానికి బయలుదేరడంతో యత్నము ఆరంభమయినది. రెండవంకంలో (బిందువు+ప్రయత్నము=ప్రతిముఖసంది).

ఈ యత్నంవల్ల తాత్కాలికంగా ఫలసిద్ధి కలిగినట్లు కనిపించినా అవాంతరాంశము ఏదో ఒకటి వచ్చిపడి సంపూర్ణ ఫలసిద్ధికి ఆటంకము కలిగించవచ్చు. ఇట్లా ఆటంకము కలిగింఛే అవాంతరాంశాన్నే "పతాక" అంటారు. ఈ ఆటంకంవల్ల ఫలసిద్ధి అనిశ్చితమవుతుంది. దీనినే ప్రాస్త్యాశ అంటారు.

శకుంతలాదుష్యంతులకు గాంధర్వవివాహము జరిగినా దుర్వాసశాపము వచ్చిపడి సంపూర్ణ ఫలసిద్ధికి ఆటంకము కలిగించింది. దుర్వాస శాపమే శాకుంతల నాటకంలో పతాక. రాజు ఇచ్చిన ఉంగరము జారిపోవడం ప్రాప్త్యాశ. పతాకాప్రాప్త్యాశల కలయికగల భాగము గర్భసంధి (పతాక+ప్రాప్త్యాశ=గర్భ సంధి). మూడవ అంకంనుంచి పంచమాంకంలో శకుంతల మేలిముసుగును గౌతమి తొలగించేవరకు గర్బసంధి. ఉంగరము పొవడము యొక్క ఫలితమే రాజు శకుంతలను నిరాకరించడం.

తాత్కాలికంగ వచ్చిన ఈ అవాంతరాన్ని ఇంకో అవాంతరము వచ్చి తొలగించి తాను తప్పుకోవచ్చు. దీనినే ప్రకరి అంటారు. ఆటంకము తొలగగానే ఫలసిద్ధి కలుగుతుందనే ఆశ చిగురిస్తుంది. ఈ ఆశనే నియతాప్తి అంటారు. శాకుంతలంలో ఉంగరము రాజుకంటపడి శాపవిముక్తి కలగడం ప్రకరి. మరీచాశ్రమంలో భరతుని వృత్తాంతము వినగానే దుష్యంతుని ఆశ చిగురించడం నియతాప్తి. ప్రకరీ నియతాప్తుల కలయిక గల భారము ఆవమర్శసంధి. (ప్రకరి+నియతాప్తి=అవమర్శసంధి).

ఆటంకాలన్నీ తొలగి ఆశయము దగ్గరపడటం కార్యము. సమగ్ర ఫలసిద్ధి కలగడం ఫలాగమము. శాకుంతలంలో శఖుంతలాధుష్యంతుల సమావేశము కార్యము. దుష్యంతుడు శకుంతలను క్షమాపణ వేడడం, తరవాత వారి సమ్మేళనము ఫలాగమము. కార్య ఫలాగమాల కలయికగల భాగము నిర్వహణసంధి. (కార్యము+ఫలాగమము=నిర్వహణసంధి). ఇది సప్తమాంకం మధ్యనుంచి నాటకం చివరివరకు వ్యాపించింది.