పుట:RangastalaSastramu.djvu/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఔత్సాహిక ప్రయోగాలలో మెరుగులుదిద్దే పూర్వాభ్యాసాలకు వినియోగించేది సరసామాన్యంగా చాలా తక్కువకాలము. దీనికి కారణము ప్రదర్శనలెక్కవ పడటానికి అవకాశాలు లేకపోవటం. అంతేకాదు; బోధించడం, నేర్చుకోవటం అనే మొదటిదశలో పూర్వాభ్యాసాలకే ఎక్కువ వ్యవధి వినియోగించడం జరుగుతుంది. దర్శకుడు కొన్ని పూర్వాభ్యాసాలను, మెరుగులు దిద్దడానికి కేటాయించవలె. ఇట్టి అభ్యాసాలకు కొంతమంది సహృదయ విమర్శకులను ప్రేక్షకులుగా పిలవడం మంచిపద్ధతి. ప్రేక్షకులుండటంవల్ల నటీనటులు తమ బాధ్యతలను మరింత హెచ్చరికతో నిర్వర్తించేఅవకాశమేర్పడుతుంది. ప్రదర్శనలోని ముఖ్యసమస్యలు-మొదటిది: నాటక గమనవేగము. రెండవతి: సంభాషణలు వినిపించే స్థాయి. ఈ రెండింటిలో లోపము ఉండడం సర్వసామాన్యంగా జరుగుతూఉంటుంది. సంభాషణస్థాయిలో లోపానికి కారణము సంబాషణలు పూర్తిగా కంఠస్థము కాకపోవటం. దీనివల్ల పక్కనటుని అందింపుమాటలు (cues) వెంటనే అందుకోలేక పోవటం; దానిపరిణామంగా, నాటక గమనవేగము (pace) తగ్గిపోవటం జరుగుతుంది.

మామూలుగా జరిగేది: రామారావు సంభాషణ చెప్పి ఆగుతాడు; ఆ తర్వాత చిన్నవిరామమౌ: ఆ తర్వాత సంభాషణ సుబ్బారావుది; అతడు మెలకువ తెచ్చుకొని తన సంభాషణ చెబుతాడు.

నిత్యజీవితంలో ఇట్లా జరగదు, ఈ విధానము రాదు. చెప్పే జవాబు ప్రత్యేకంగా ఒత్తి శక్తిమంతంగా చెప్పవలసినప్పుడుగాని, సందేహము కలిగి నప్పుడు గాని మాత్రమే విరామముంటుంది. తక్కిన సందర్భాలలో సంభాషణ చకచకా నడుస్తుంది. ఒక్కొక్కసారి, అవతలమనిషి మాటలు పూర్తికాకుండానే అతడు పూర్తిచేయవలసిన మాటలు మనమే ఊహించుకొని, ఠక్కున మధ్యనుంచే మన సంభాషణ ఆరంబించటం కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి