పుట:Ranganatha Ramayanamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

సమాలోచనము

వచ్చును. క్రమక్రమముగ నిపుడు రాయలసీమవా రనవచ్చును. ఈసీమలోఁ గల గ్రంథములు, కవులు, దేశమునం దంతటను సంస్మరింపఁదగిన యాదృతిని గడించినవా రనుటలో నతిశయోక్తి లేదు. ఇం దుత్పత్తియగు వస్తువులఁ గాపట్యము లేదు. వీనికి సహజప్రభ గలదు. మెఱుగు లనవసరము.

కవి యిప్పటి కించుమించుగ నేడువందలవత్సరముల క్రిందటివాఁడే యయినను, బద్యకావ్యము తెరువునకుఁ బోక, ద్విపదకావ్యముగనే గ్రంథమును సాగించి, నవరసభరితముగ వెలయించుటలో నీమహానుభావుని ప్రతిభ యప్రతిమ మని చెప్పవలయును. సంస్కృతాంధ్రముల నసమానపాండితీవిరాజితుఁ డనుట యతిశయోక్తి కాజాలదు. గ్రంథమును జదువువారలే యీవిషయమును నిర్ణయింపఁగలరు, అగసాలి కమ్మియచ్చునఁ దీసిన బంగరుకమ్మివలె నెగుడుదిగుడులు లేక సరళముగ స్నిగ్ధగుణము గలిగి యతిశయప్రభతో రచన యున్నదని ముమ్మాటికిఁ జెప్పవలయును,

ప్రామాణికులగు కవుల పంక్తిలో నొక్కఁ డీరంగనాథుఁ డనుటకు లాక్షణికు లగు అప్పకవి మొదలగువారు తమ లక్షణగ్రంథములలో నుదాహృతములగు గ్రంథభాగములే చెప్పుచున్నవి. అందందు దుష్టసంధులు, వ్యాకృతికి లొంగని ప్రయోగములు కనఁబడుచున్నవి. రేఫశకటరేఫమైత్రి యీమహనీయున కభిమతమా యని తలంపవలసినచోట్లు కలవు. ఒక్కొక్కచోట బమ్మెర పోతన యితని ననుసరించెనా యని యనవలసిన భాగములును గలవు.

ఇందు గ్రంథాదినుండి—“ఆదినారాయణు నఖిలలోకేశు, భావించి కీర్తించి ప్రార్ధించి సేవించి, యభిమతసిద్ది గావింప"—అనువఱకుఁగల ధ్యానయోగమును జదివినచో నీగ్రంథకర్తకుఁ గల యోగాభ్యాసవిధానము సద్గురుకృపాజనితసత్పద్ధతి యెంతయు విశదము కాగలదు. ఇందు యోగశాస్రసారమంతయు నిమిడియున్న దనవలయు. గొప్పభక్తుఁ డనియు, యోగి యనియు నీతనిఁ గీర్తింపవలయు. లేక యున్న నింతటిగ్రంథమును ద్విపదగా రచించి జనరంజన మొనరించుట కనువు పడునా? ఇష్టదేవతాస్తుతిలో శారదను, వాల్మీకిని, వ్యాసమహర్షిని, శుకబ్రహ్మను మాత్రమే వినుతి చేసినాఁడు. పూర్వకవులనుగాని, తత్కాలమంధలి కవులనుగాని పేర్కొనలేదు. ఎవరిని బేర్కొనిన నేమి తనపేరు తెలియునో యని తలంచెనో - ఆత్మజ్ఞాని యగుట తనపేరు ప్రకటించుకొనుట తగదనుకొనెనో? తనప్రభువులయెడ నపచారము చేసినట్లుగా నెంచెనో? ఇదియును గాక మీఁదుమిక్కిలి తనకుఁగల ప్రభుభక్తిని బూర్ణముగా వెలయించి ధన్యుఁడైనాఁడు.

అందందు వర్ణనలు యుక్తియుక్తముగ హృదయంగమముగ ఔచిత్యముగ నున్నవి. వీని నన్నింటిని బ్రత్యేకించి యిందుదాహరింప గ్రంథవిస్తరభీతి మానితిని.