పుట:Ranganatha Ramayanamu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాయసురేశ్వరుం డటు ముక్కుఁ జెవులు - వోయిన నెంతయు బుద్ధిలో రోసి
"మును చెలియలి బన్నమునకు నై యాత్మ - నెనసిన సిగ్గులు నె గ్గొనరింప
వనజాప్తకులునితో వలవనిపైర - మున మగఁటిమితోడఁ బోరాడుచున్న
నాకారికడకు మానము గోలుపోయి - యీకష్టతనువుతో నేమని పోదుఁ?
బోరికి నుచితంబు పోవుట యనుచు - నారక్తపూరంబు లందందఁ గ్రమ్మి3990
తనువుల నిండ నుద్దండవర్తనుఁడు - ఘనతరరోషంబు గడలుకొనంగఁ
జేవురుచాయల సెలయేఱు లమరఁ - గా వచ్చు నీలాద్రికైవడి దోఁప
నటుగాక వీఁడు యుగాంతంబు నాఁటి - చటులాగ్ని యన రణస్థలికి నేతెంచి
యఱిమఱి గోపించి యగచరసేనఁ - దఱిమి దానవుఁ డత్యుదగ్రుఁడై మెఱసి
కడునుగ్రముగఁ గడకా ళ్లొగిఁ బట్టి - వడిఁ గ్రప్పి త్రిప్పి యుర్వరవ్రేసివ్రేసి
బిఱబిఱఁ బ్రేవులు పిడికిటితోనఁ - బెఱికిరాఁ గొందఱఁ బిడికిళ్ళఁ బొడిచి
నిబ్బరంబుగ దాచి నెరయ గుండియలు - ద్రొబ్బలు నురకంగఁ ద్రొక్కి పాదములఁ
బిడుగులఁ బోలెడు పెడచేతు లెత్తి - కడు నుగ్రముగ మన్నుఁ గఱువంగ నేసి
తనమీఁదఁ బ్రాకిన తరుచరావళుల - విన విస్మయంబుగా వే నిగ్రహించి
యగపడ్డరాక్షసు నైనను బట్టి - తిగిచి వేగమునఁ గుత్తికలోన వైచు4000
ఝంకారరవముల శవములు సేయు - హుంకారరవముల నుసురులు వెఱుకు
దివిజవిమానముల్ దిరుగుడుపడఁగఁ - దివిచి మర్కటులమీఁదికి నెత్తి వైచు
నెగసిన కపులతో నేటు దాఁకంగ - నగచరావలిఁ బట్టి యందంద వైచు
నెమ్ములు నురుముగా నేపారఁ ద్రిప్పి - యిమ్ములఁ గొందఱ నెడగల్గ వైచుఁ
గొందఱ నిరుగేలఁ గుదియంగఁ బట్టి - యందందఁ దాటించి యల్లంత వైచు
నీవానరులఁ జూడుఁ డేర్పడ ననుచు - లావునఁ గొందఱ లంకలో వైచుఁ
బెంపార నినుగట్టి పేర్చినకపుల - ముంపుమీ యని యబ్ధి మునుఁగంగ వైచు
నివ్విధంబున దానవేశ్వరుం డెలమి - నవ్వానరుల దిక్కులం దెల్లవైచు
మేదినియందును మిన్నులయందు - నేదిక్కులందును నెడము లేకుండఁ
బడిఁ జచ్చుకపులును బడి దొర్లుకపులు - బడి కూఁత లిడుకపుల్ భ్రమనొందు కపులుఁ4010
బడి తన్నుకొను కపుల్ పడి రోఁజుకపులు - పడియున్న కపులును బడియెడుకపులు
నై రణస్థలి యెల్ల నగచరాక్రోశ - మారాక్షసునిచేత నగ్గలం బయ్యె,
నాకుంభకర్ణుని యత్యుగ్రభీష - ణాకృతి కాలాంతకాకృతి యైన
నణఁగెఁ దారాపతి యణఁగె నంగదుఁడు - నణఁగె గవాక్షుఁ డున్నతిఁ దక్కె గజుడు
చలియించె ఋషభుండు శంకించె నలుఁడు - పెలుకురె నీలుండు బెగ్గిలెఁ బృథుఁడు
వెఱఁగందె శరభుండు వెఱచె ధూమ్రుండు - నురుకంపమును బొందె నొగిఁ బనసుండు
కడుభీతి నొందెను గంధమాదనుఁడు - నడరి చూచుచునుండె ననిలనందనుఁడు