పుట:Ranganatha Ramayanamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

సమాలోచనము

రంగనాథుఁడు ఈ ద్విపదకావ్యమును రచించెనని తెల్పితి. ఈ విషయమున వాదోపవాదములు విరివిగా సాగుచున్నవి. ఇవి తుదకుఁ బొడవుచేతుల పందేరమను నట్లు వ్యక్తిత్వాభిమానమును బట్టి, మొగమోటమునుబట్టి వ్యాప్తిలోఁ బడుచున్నవి. కాని యిదమిత్థమ్మని నిర్వచించువారు కనంబడరు. తాఁబట్టిన కుందేటికి మూఁడేకాళ్లను నట్లుగ నధికారప్రాబల్యమువలనఁ దమ వాదమే నిర్వివాదమనుటను ప్రతిష్ఠించు చున్నారు. ఇట్టి విమర్శకాగ్రేసరులు చారిత్రిక పరిశోధకులు నందందు మిక్కుటముగ నాశ్రయించి పదవినిగాంచి యా పదవియందుఁ దమకు నెదురులే రను స్థిర బుద్ధితో లోకమును నపమార్గముఁ ద్రొక్కించి "ఘటం భింద్యాత్పటం ఛింద్యా త్కుర్వాద్వా గార్దభస్వరమ్, యేనకేనా ప్యుపాయేనప్రసిద్ధః పురుషోభవే"త్తనునట్లు తార్మాఱు గావించుచున్నారు. ఇది పలుకుబడి గడుసుఁదనమేగాని తాత్త్వికశక్తి యుక్తము గాదు. ఇట్టి చారిత్రిక శోధకులు కవులను ఈ మూలనుండి యామూలకు, నీ గ్రామము నుండి యా గ్రామమునకు, నీ పట్టణమునుండి యా పట్టణమునకు బంతులఁబోలె నెగఁ జిమ్ముచున్నారు. పాపము ! కీర్తికాయులైన వారి యాత్మలు వీరి యస్తవ్యస్త కృత్యమునకు నెంతెంత యుమ్మలించుచున్నవో ? బ్రదికియే యుండిన నింతటి ధీరత్వ మీ విమర్శకుల కుండఁ గల్గునా? దొరతనము ఈ విషయమున నూరకుండునా ? ప్రాభవమునఁ గావించు నీ వ్రాతలను లోకము సమాదరింపక యుండుట లగ్గు.

రంగనాథుఁడు రామాయణమును తాను రచించినట్లు గ్రంథమున నెందును దెల్పలేదు. లోకమునఁ బేరు వ్యాపింపవలయునన్న నిర్హేతుకముగఁ గాఁజాలదు . ఇంచుకయైన నిదానముండవలయును. గ్రామములకు, దేశములకు, ఇండ్లకు, గ్రంథములకు నామధేయములు వాస్తవతనుబట్టి యుండుట లోక ప్రసిద్ధము. మాఘము శిశుపాలవధమున కేల ? కిరాతార్జునీయమునకు భారవియననేల? మల భూపాలీ యమను పే రెట్లు వచ్చినది ? ఆనంద రంగరాట్ఛంద మని యేల యనవలయు ? ఇట్లే ఈ కృతియు ద్విపదరామాయణ మనరాదా ? రంగనాథ రామాయణమని యననేల ? ఇందలి యవతారికయందలి "భూమిఁ గవీంద్రులు బుధులనుమెచ్చ - రామాయణంబు పురాణ మార్గమున విరచింపు" మని చెప్పటయు, "మాతండ్రి విఠలక్ష్మానాధుపేర....... శ్రీరామచరిత మొప్పఁజెప్పెద" నని బుద్ధరాజు చెప్పటయు రామాయణ రచనకుఁ గారణముగా వచియింతురు. కాండాంతములయందును. “తమ తండ్రి విఠ్ఠల ధరణీశు పేర ... ... చెలువొందు రామాయణంబు" అని యున్నది. ఈ విషయమునుబట్టి చూడఁగాఁ బండితకవు లాత్మస్తుతి చేసికొనుట యాచారములేదు. కావున బుద్దరాజు తన్ను దాను నుతించికొనియుండునాయని యనుమానము కలుగక మానదు. కాని యీ సందర్భమున మల్లినాథుఁడు, ఆదికవి యగు నన్నయభటు, అల్లసాని పెద్దన మున్నగువారు తమ గ్రంథములలో నిట్లే తమ్ముతాము నుతించుకొని యున్నారని