పుట:Ranganatha Ramayanamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాలోచనము

శ్రీమద్ద్రామాయణము మహాకావ్యము. ఆదికవియగు వాల్మీకి మహర్షి ప్రణీతము. ఆదికావ్యమని దీనికిఁ బేరు. “ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్" అనునదియే దీని మహిమము. ఈ గ్రంథము శతకోటి ప్రవిస్తరము. భూలోకమున నియ్యది చతుర్వింశతి సహస్ర గ్రంథముగాఁ బ్రకాశితము. గీర్వాణ వాణి నియ్యది విరాజితము. పురుషార్థ చతుష్టయప్రదము. సకల ప్రపంచముల నీ గ్రంథము వ్యాప్తమైనట్లు శ్రుతిస్మృతి ప్రసిద్దము.

ఈ మహామహిమోపేతమగు శ్రీమద్ద్రామాయణమును దేశమునఁగల సకల భాషలయందును బూర్వులగు మహాకవులు అనువదించి గీర్వాణభాష తెలియనివారి కనువుగ నుండునట్లు కావించిరి. ప్రకృతము కావించుచున్నారు. కావింతురు. “ఎంద ఱెన్ని గతులన్ వర్ణించినన్ గ్రాలదే" యన్నట్లు సంగ్రహముగఁ గొందఱు, యథా మూలముగఁ గొందఱు, వచనరూపమునఁ గొందఱు, పద్యరూపమునఁ గొందఱు, నాటకరూపమునఁ గొందఱు, యక్షగాన రూపమునఁ గొందఱు, పదముల (జంగము కథా) రూపమునఁ గొందఱు నీ మహాకావ్యమును బ్రపంచమునఁగల యన్ని భాషలలోనికి మార్చి జన్మము ధన్యతమముం గావించియున్నారు.

తెలుఁగు బాసయందు జనులకు సుసులభముగ నవగతము కావలయునని రంగనాథుఁడను కవి ద్విపదరూపమున రచించెను. ద్విపదకావ్యమునకుఁ గల పలుచఁదనమును దన కావ్యనిర్తాణమునఁ దొలఁగించెను. అతని సమకాలికుఁడగు భాస్కరుఁడు మొదలగు కవులు పద్యకావ్యముగ రచించిరి. తర్వాత ఉభయకవి మిత్రుఁడును, కవి బ్రహ్మయును నగు తిక్కన సోమయాజి నిర్వచనోత్తరరామాయణ మను పేర రంగనాథ భాస్కరాదులు తెలిఁగింపని యుత్తరకాండము తెలిఁగించెను. ఇటీవలఁ దెలుఁగు పద్యకావ్యములుగా మూలానుసరణముగా శ్రీ గోపీనాథము వేంకట కవిగారును, శ్రీ వావిలికొలను సుబ్బరాయ కవిగారును, శ్రీ కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రి శర్మగారును, శ్రీ మహామహోపాధ్యాయ కళాప్రపూర్ణ శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రులు గారును వ్రాసిరి. వీరిలో యథామూలముగఁ దెలిఁగించినవారు కొందఱు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ కవిగారును తెలిఁగించినారని యిటీవల వినవచ్చుచున్నది. ఇంక నీ మహాకావ్యమును సంగ్రహముగ అయ్యలరాజు రామభద్ర కవియు, కుమ్మర మొల్లమ్మయు, కూచిమంచి తిమ్మకవి మొదలగువారు కావ్యఫక్కిలో పస్తుభేదము గనఁబడనియట్లు నడపిరి.