పుట:Ranganatha Ramayanamu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హాహానినాదంబు లడరించువారు - నాహనుమంతుపై నలిగెడివారు;
నావిష్ణుఁ డారాముఁ డతనికి నెగ్గు - గావించె నీపాపకర్ముఁ డన్వారు;
అట్టికీ డొనరించి నట్టి రావణుని - కిట్టియాపద వింతలే? యనువారు;
ననుచుండ నెంతయు నత్యుగ్రుఁ డగుచు - వనచరవీరుండు వడిఁ జెలరేగి
యొకచోటఁ దప్పక యుండ నాలంక - సకలంబు గాల్చి యుత్సవకేళిఁ దేలి
యెడపక పైవ్రాలు నెఱమంటతునుక - లుడుగక మ్రోయుచు నొగి దూలి తూలి
సోలి సురాపానసుఖసుప్తి మునిఁగి - కాలుట యెఱుఁగక కాలెడువారు
నాయెడ మృదులశయ్యలయందు నిదుర - పోయి పోయినయట్లుఁ బొందులు నమలి
తెలివికి నెడమీక తీవ్రాగ్నిశిఖల - మెలఁగి మిడుగలేక మృతిఁబొందువారు940
తమతమబంధులఁ దమవధూమణులఁ - దమతమబిడ్డలఁ దమప్రాణసఖులఁ
దమతమవారలఁ దగఁ దోడుకొనుచు - గుమురులు గట్టి యేగుచు మ్రగ్గువారు
తెగి యిండ్ల సరుకులు దిగిచి తేఁబోయి - మగిడి రానేరక మ్రగ్గెడువారు;
సతులఁ గౌఁగిటఁ జేర్చి సరి తెచ్చితెచ్చి - ధృతి దూలి వాకిండ్లఁ ద్రెళ్ళెడువారు;
నై లంక ఘూర్ణిల్ల నంతంతఁ గలయ - నాలోకభయదంబు లై మీఱిమీఱి;
యురుసింహములఁ బోలె నుగ్రతఁ బట్టి - కరికుంభవిదళనగతి మండిమండి;
యోజ పెంపారు నాహుతులచందమున - వాజులమీఁదికి వడి దాఁటి దాఁటి
తగిలించు వరవిటోత్తములచందమున - మొగి కామినీకుచంబులఁ బ్రాకిప్రాకి;
భావించి యన్యులఁ బ్రహసించువారు - కైవడి నాలుక లఱచియు గఱచి
తగిలి సంతాపంబు దలకొన్నవారు; - మిగిలి యుబ్బెడుగతి మిన్నంది యంది950
బెలుకుఱి పఱతెంచు భీతులపగిది - తొలఁగక నిగుడి గొందుల దూరి దూరి
వాలుచు నిబ్భంగి వాయునందనుని - వాలాగ్ను లొగి లంక వడి చుట్టుఁ గాల్చె;
గాల్చిన నుబ్బి దిక్పతులు దేవతలు - మేల్చుట్ట మితఁ డని మెచ్చి త న్పొగడ
హనుమంతుఁ డంతట నంతరంగమున - జనకజభీతిమై శంకించి బెదరి
"యీలంకతోఁగూడ నినవంశుదేవిఁ - గాలిచితిని గన్నుగానక క్రొవ్వి
యే నింక రఘురాము నేమని కాంతు? - జానకిసేమ మేసరణిఁ దెల్పుదును?
దప్పెఁ గార్య" మటంచుఁ దల్లడం బంది - యప్పుడు తనమది నట వివేకించి
యేతల్లిదీవెన నీఘోరవహ్ని - నాతోఁకరోమ మైనను గాల్ప వెఱచె
నట్టి సీతాదేవి కగ్నిచే భయము - పుట్టునే యిది యేటి బుద్ధి యటంచు
ధరణిజ మదిలోనఁ దాపాగ్ను లార్చు - వెరవున వాలాగ్ని విషధిలో నార్చి,960
వెస నశోకారామవీథికిఁ బోయి - యసురకాంతలు భయమంది వీక్షింప
దనుజకాంతలచేతఁ దనసేమమెల్ల - విని మున్నె సంతోషవివశ యై యున్న
జనకపుత్రికి మ్రొక్కి సన్నిధి నిలిచి - తనపౌరుషములెల్లఁ దగ విన్నవించి,