పుట:Ranganatha Ramayanamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఏలోకమున నైన నిల మర్కటులకు - నీలావు గలదె? వీఁ డెవ్వఁడో తెలియ
రాదు మీరేవురు రణబలోదగ్రు - లై దర్ప మేర్పడ నాత్మ నేమఱక
యగణితసైన్యసహాయులై వానిఁ - దెగువమై నిటఁ బట్టి తెండు పొం" డనిన
వారును బహురథవారణతురగ - వీరదైత్యులతోడ వేవేగ కదలి
ప్రాగ్గిరిపై నుండు భానుండు పోలె - దిగ్గగనాంతరతీర్ణతేజమునఁ
దోరణం బెక్కి బంధురదైత్యవరులఁ - దోరణం బొనరింప దొరుకొనువాని
ననిలసూనుని దాఁకి యవనియు దిశలు - చినుగంగఁ గూయుచు సింహనాదముల
నందఱు దివ్యశస్త్రాస్త్రము ల్గురియ - నందులో దుర్ధరుం డను పేరువాఁడు720
ఐదుబాణంబుల ననిలజునురము - భేదించుటయు రోషభీషణుం డగుచు
కపివీరుఁ డార్చి యాకసమున కెగయ - నపుడు దుర్ధరుఁ డంత నతనితో నెగసి
విలునారి సారించి విలయకాలోగ్ర - జలదంబుకైవడి శరవృష్టి గురియ
నాయుగ్రశరవృష్టి నడచి వాయుజుఁడు - నాయెడఁ బొడవుగా నట మింటి కెగసి
వడివడిఁ బఱతెంచి వానిపైఁ బడిన - బొడిపొడి యై కూలెఁ బుడమి రక్కసుఁడు.
అది చూచి యావిరూపాక్షయూపాక్షు - లదయులై ముద్గరహస్తులై కదిసి
యాకసంబున నిల్చి యార్చి పేర్చుటయు - నాకరువలిపట్టి యటఁ దాను నెగసి
వారితోఁ బోరాడ వారును నతని - ఘోరముద్గరములు గొని వ్రేయుటయును
జగతిపైఁ బడి లేచి సాలభూరుహము - నగలించి మఱియును నార్చుచు నెగసి
చిక్కనిభుజశక్తిఁ జిరచిరఁ ద్రిప్పి - యొక్కదెబ్బనే వారి నుర్విపైఁ గూల్చె.730
భాసకర్ణుండును బఘసుండు నంత - నాసమీరాత్మజు నదరంటఁ దాఁకి
పటుశూలపట్టనప్రహతుల నొంప - నట రక్తసిక్తాంగుఁడై వాయుసుతుఁడు
కోపించి మిక్కిలి కులశైలసదృశ - మౌపర్వతం బెత్తి యసురులమీఁద
స్రుక్కక వైచినఁ జూర్ణమై పడిరి - కొక్కులు వడి గంటఁ గూలుచందమున
వాయునందనుఁ డంత వారిసైన్యముల - నాయంతకుఁడు వోలె నణఁగించె నపుడు
పడుకరు ల్చెడుహరు ల్పఱచుకాల్బలము - కడతేరుతేరులు కలఁగుశూరులును
మడియుమహారథు ల్మ్రగ్గుసారథులు - పొడి యైనశస్త్రము ల్పొలియునస్త్రములు
కడిఖండలైన చక్రప్రాసములును - మడిసినగుఱ్ఱము ల్మ్రగ్గుకాల్బలము
కూలెడుమావుతు ల్గ్రుంగురావుతులు - తూలెడుగొడుగులు త్రుంగుపడగలు
పఱచునెత్తుఱుటేర్లు బహుమాంసములును - నురుగ్రమ్ము భూతంబులై రణం బొప్ప740
క్షణమాత్రమున వారిఁ జంపి వాయుజుఁడు - రణకాంక్ష మఱియుఁ దోరణ మెక్కియుండెఁ
బంచసేనాగ్రగు ల్పంచత్వ మొంది - రంచును హతశేషు లయ్యెడఁ దెలుప

హనుమంతుని మీఁదికి అక్షకుమారుఁడు వచ్చుట

రాక్షసపతి యంత రణబలోదారు - నిక్షుచాపాకారు నిద్ధవిచారు