పుట:Ranganatha Ramayanamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కులశైలములఁ దాఁకి కులిశాయుధంబు - పెళపెళధ్వనులతో భేదించినట్లు
బలువిడి రథముల పైకి లంఘించి - పొలుపార రథరథ్యములు నేలఁ గలపి
రథులఁ జెండాడి సారథుల నుగ్గాడి - పృథుశక్తి యుక్తిమైఁ బెఱికి వేఁటాడి
మును మున్ను రక్తరోముని నేలఁ గూల్చి- స్తనితహస్తునిఁ ద్రుంచి శతజిహ్వు నణఁచి
రుధిరాక్షుఁ జంపి దుర్ముఖు విచారించి - కదనవిక్రము వ్యాఘ్రకబళు ఖండించి
శూలదంష్ట్రు వధించి శూరత మించి - కాలపాశాభీలకరవాలుఁ డగుచు
నురవడి నిబ్భంగి నొక్కక్కతెగువ - తరమిడి పెలుచ నుద్దండరాక్షసుల
బలములతోఁగూడ భస్మంబుఁ జేసి - తలఁకక మారుతాత్మజుఁ డున్నఁ జూచి
పోరిలో నిలువక పోయినవారు - వారిచావులు చెప్ప వడి కోప మెచ్చి
యటఁ బ్రహస్తునిపుత్రుఁ డగు జంబుమాలి - చటులప్రతాపసంచలితాంశుమాలి690
కుటిలారిపర్వతక్రూరరంభోళి - బటుబాహుబలశాలిఁ బనిచె రావణుఁడు
పనిచిన నాదైత్యపతికి మ్రొక్కుచును - అనురక్తి రక్తమాల్యాంబరోదగ్ర
సమరోగ్రశస్త్రాస్త్రసన్నద్ధుఁ డగుచు - నమితరథారూఢుఁడై యేగి యపుడు
శింజినీటంకారసింహనాదములఁ - గంజజాండము హల్లకల్లోలముగను
హరిఁ దాఁకు నున్మత్తహస్తిచందమున - నరుదైనకడిమిమై హనుమంతుఁ దాఁకి
కెరలి మేఘము మహాగిరిఁ టోలె దివ్య - శరవృష్టిఁ గురిసినఁ జలియింప కతఁడు
పెనుశిల దైత్యుపైఁ బెఱికి వైచుటయుఁ - గని దాని శరదశకంబుచేఁ దునిమి
హనుమంతు వదనాబ్జ మర్ధచంద్రాస్త్ర - మున నొంచి పదిబాణములు బాహుయుగము
నాటించి యొకశక్తి నడునెత్తి పగుల - మేటియై యేసిన మిగుల రోషించి
పవమానతనయుండు బాహుదర్సమున - నవలీల నొకసాల మగలించి వైవ700
నాలుగమ్ములఁ దాని నడుమనే త్రుంచె - నాలోన హనుమంతుఁ డాదైత్యురథము
పదములఁ బడఁదన్ని పట్టి దంష్ట్రములఁ - గదిసి విచారించి గర్జించి వేసి
పొదివి మహావాలమున నశ్వసమితిఁ - జదిపిన విరథుఁడై జంబుమాలియును
బలుకయు నడిదంబు బలువిడిఁ గొనుచు - నలవుపెంపును గూడ నార్చుచు వచ్చి
పవమానతనయునిఫాలంబు వ్రేయ - నవశుఁడై మూర్ఛిల్లి యంతలోఁ దెలిసి
పిడుగుతో సరిపోలు పిడికిటఁ బొడిచె - పొడిచి భంగముఁ జేసి పోనీక కదిసి
యొడిసి కైదువఁ గొని యుగ్రుఁడై కదిసి - తడయక యాదైత్యుతలఁ ద్రెవ్వ నేసె.
ధృతి దూలి యతఁ డుర్విఁ ద్రెళ్ళె ద్రెళ్ళుటయు - హతశేషు లతనిపా టంతయుఁ దెలుపఁ
గడుజోద్య మంది రాక్షసమంత్రివరులఁ - దడయక పిలిపించి తగఁ గొలు విచ్చి
దనుజనాథుఁడు గొంతతడవు చింతించి - యనిమిషేంద్రుని నైన నాజి గైకొనని710
యలఘువిక్రము విరూపాక్షు యూపాక్షుఁ - గలహదుర్ధరు భాసకర్ణాఖ్యుఁ బ్రఘసు
వదయులఁ బంచసేనాగ్రనాయకులఁ - గదనకర్కశుల నొక్కటఁ జూచి పలికె