పుట:Ranganatha Ramayanamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మసలక నెలలోన మరలిరం డనిన - నసమునఁ గపు లేగి రన్నిదిక్కులకుఁ
బటుశక్తి దక్షిణభాగంబు వెదక నిటు నంగదుఁడు మొద లేము కొందఱము
చనుదెంచి పెక్కుదేశంబులు వెదకి - నినుఁ గాననేరక నివ్వెఱగంది
శోకింప నరుణుని సుతుఁడు సంపాతి - మాకు లంకాపురిమార్గంబుఁ జూపెఁ;
జూపుటయును నిన్నుఁ జూడ నర్థించి - యేపునఁ బఱతెంచి యే నబ్ధి దాఁటి
మఱి యంత సూర్యాస్తమయమున నితరు - లెఱుఁగకుండఁగ వచ్చి యీలంకఁ జొచ్చి,
విలసిల్లు నామహావేషంబు దాఁచి - సొలవక ని న్నెల్లచోటులు వెదకి
యెందును బొడగాన కిటు లేగుదెంచి - యిందు నిన్ దర్శింప నేర్పడఁ జూచి
రవికులోత్తముఁ డైన రామునిదేవి - యవునొకొ కాదొకో యని విచారించి
సృష్టీశుచే విన్నచిహ్నంబు లెల్ల - దృష్టించి పిదప సందేహంబు వాసె
వల నేది యిప్పుడు వచ్చి రావణుఁడు - తలఁకక మిముఁ బల్కుతఱి నున్నవాఁడ
ఘనశక్తి వానితోఁ గయ్యంబు చేసి - యని వానిఁ జంపెద నని విచారించి
పూని నిన్ దర్శించి పొందొంద నీకు - నీనాథుసేమంబు నిజముగాఁ జెప్పి
దనుజుఁ .బిమ్మటఁ జంపఁ దలపోసి కాని - వనిత! నాప్రాణము ల్వంచించి కాదు”
అని చెప్పి రఘురాము నలవుప్రాయంబు - కనుఁగవచెలువంబు గళముసోయగము
నగుమోముకళయును నఖములతీరు - నెగుబుజంబులబాగు నెరికొనులాగు510
వెడఁదఱొమ్ముబెడంగు వీనులరంగు - నడలయందంబును నాభిచందంబు
ఘనజఘనముపెంపు కరములకెంపు - తనువులక్షణమును దప్పక చెప్పి
యాశౌర్య మాధైర్య మాబ్రహ్మచర్య - మాశాంతి యాదాంతి యామహాక్షాంతి
యాశక్తి యాయుక్తి యాపితృభక్తి - యాశీల మాలీల లన్నియుఁ జెప్పి
రూపించి లక్ష్మణు రూపెల్లఁ జెప్పి - యాపుణ్యుఁ డంగుళీయక మప్పు డిచ్చె.
యిచ్చినఁ గైకొని యిపుడు ప్రాణములు - వచ్చెఁగా యనుచు నెవ్వగ నూరడిల్లి
రాముఁ జూచినకంట రామ రాగిల్లి - సేమ మేర్పడ భద్రసింహాసనమునఁ
బ్రేమతోఁ గూర్చుండఁబెట్టినకరణి - నామణిముద్రిక నక్కునఁ జేర్చి
యనురక్తి నర్ఘ్యపాద్యము లిచ్చినట్లు - కనుఁగవ హర్షాశ్రుకణములు దొరుఁగ
ధూపంబు దీపంబుఁ దోడ్తోడ నొసఁగి - యేపార సాష్టాంగ మెఱఁగినపగిదిఁ520
బులకించి తిలకించి పొలఁతి మూర్ఛిల్లి - తెలిసి యాహనుమంతుదెసఁ జూచి పలికెఁ
"గఫివంశవర్య! రాఘవకార్యధుర్య! - యుపకారనిరత! లోకోన్నతచరిత్ర!
పవమానసుత! నాకుఁ బ్రాణదానంబు - తవిలి చేసితి నీకుఁ దగఁ జేయలేను
గాకుత్స్థతిలకంబుకరుణ నీ వింక - నాకల్పముగ నుండు" మనుచు దీవించె
నలఘువిక్రమశీలుఁ డగు వాయుసుతుఁడు - చెలువ జానకిఁ జూచి చేతులు మొగిచి
“హరునకు నైన నింద్రాదుల కైనఁ - బరమేష్ఠి కైనను బడయఁ జొప్పడని