పుట:Ranganatha Ramayanamu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కడఁగి రాక్షసమాయ గాఁబోలు" ననుచుఁ - బడతి యూరకయుండెఁ బ్రతిభాష లుడిగి
అనిలనందనుఁ డంత నవనీతనూజ - మనసులోఁ దన్ను నమ్మమిఁ జూచి యెఱిఁగి
యాతరు వటు డిగ్గి యతిభక్తియుక్తి - నాతికి దండప్రణామము ల్సేసి
కరములు మోడ్చి "యోకల్యాణి! నన్నుఁ - బరికింపు మేను నీపతి గూర్చుబంట
జనపతి నీకు విశ్వాసంబు పుట్టు - నని యిచ్చి పుత్తెంచె నంగుళీయకము"
అని చూపి మ్రొక్కిన నవనీతనూజ - హనుమంతుఁ గనుఁగొని యతని కిట్లనియె.
“అడరెడు దనుజమాయల నను కరము - నుడుకులఁబడి వేగుచుండుదుఁ గాన470
ననఘాత్మ! రఘురామునంగుళీయకము - గనియు విశ్వాసంబు గలుగదు నాకు;
నీ వెవ్వఁడవు? మఱి నీకుఁ బే రేమి? - భూవరునకు నీకుఁ బొం దెటు లయ్యె?
ఇనకులాధిపువేష మెట్టిది? యతని - యనుజుండు సౌమిత్రి యతఁ డెట్టివాఁడు?
గాకుత్స్థుఁ డిప్పు డెక్కడ నున్నవాఁడు? - నీకు నేమని చెప్పి నిన్నుఁ బుత్తెంచె?
నేచందమున వచ్చి తీ వార్ధి దాఁటి? - నాచిత్త మూరడ నాతోడఁ జెప్పు”
మని యొప్ప నడిగిన నవనినందనకు - హనుమంతుఁ డంతయు నటఁ జెప్పఁదొణఁగె.

హనుమంతుఁడు సీతకుఁ దనజన్మము దెల్పుట

“వనజాక్షి! వాయుదేవతవరంబునను - ఘనుఁడు కేసరియను కపికులాగ్రణికి
ననుఁ బుత్రుగా నంజనాదేవి గనియె - హనుమంతుఁ డనుపేర నమరినవాఁడ;
వసుధ సుగ్రీవుఁ డ న్వానరేంద్రునకు - నసమానమతి మంత్రినై మెలంగుదును;
ఆతనిరాజ్యంబు నాతనిపత్ని - నాతనియగ్రజుం డగువాలి గొన్న480
మద మేది నలుగురుమంత్రులు దాను - నదిమొదల్ ఋశ్యమూకాద్రిపై నుండఁ
బటుసత్వమునఁ బేర్చి పఙ్క్తికంధరుఁడు - కుటిలుఁడై ని న్నెత్తికొని పోవునపుడు.
ఒదవినయాక్రోశ మూరక వినుచు - సుదతి ని న్దల లెత్తి చూచుచుండితిమి.
నెలఁత! యప్పుడు మమ్ము నీవును జూచి - తొలఁగక నీమేనితొడవులు వుచ్చి
నీవస్త్రమునఁ గట్టి నేల వైచుటయు - నావేళ సుగ్రీవుఁ డవి పుచ్చి దాఁచి
యచ్చుగా రఘురాముఁ డట నిన్ను వెదుక - వచ్చి పంపాసరోవరతీరభూమి
దాను తమ్ముఁడు నుండుతఱి నంత - నర్కసూనుండు వారలఁ జూచి రమ్మనుడు
నే నేగి రాముని నెఱిఁగి యేతెంచి? - భానుజు రామభూపాలుఁ గాన్పించి
యన్నరనాథున కర్కనందనుఁడు - కన్నసొమ్ములు సూపి కడుభక్తి మ్రొక్కె
నాతొడవులఁ జూచి హర్షించి రాముఁ - డాతని నిజశత్రు డగువాలిఁ జంపి
యుపకారశీలుఁడై యొప్పుసుగ్రీవుఁ - గపిరాజ్యపదమునఁ గరమొప్ప నిలిపె,
నతిభక్తి సుగ్రీవుఁ డంత రాఘవునిఁ - బతియుఁ గా నిజభృత్యభావంబు మోచి
అక్షీణబలధన్యు లైనవానరుల - లక్షల రెండేసిలక్షల కపుల
గర్వాంధు లగు దైత్యుకటకంబు లరసి - యుర్వీతనూభవ యున్నచో టెఱిఁగి490