పుట:Ranganatha Ramayanamu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుది నన్ను నెన్నఁడు దోడ్కొనిపోవు - నది యెన్నటికిఁ గూడు నది యెట్లు పొసఁగు?
నీదురాత్మునిచేత నిటు చచ్చుకంటె - చేఁదు మ్రింగుట మేలు; చేఁదును నాకు
వాలినదయ నిచ్చువా రిందు లేరు - హా లక్ష్మణాగ్రజ! హా ధర్మనిరత!
నీ కైన యేకపత్నీత్వంబు నేఁడు - చీకాకుపడి హత్యచేఁ జచ్చు ననుచుఁ"
గెరలెడు తనదీర్ఘకేశపాశముల - నురి పెట్టుకొని చావ నూహించె నంత.
ఆలోన నెడమక న్నదరె నాసతికి - వాలుమీనులచేత వనజంబు వోలె.
వలపుఁదెమ్మెరచేత వనలతఁ బోలెఁ - బొలఁతికి మఱి వామభుజమును నదరె;
నయ్యెడ మదహస్తి హస్తంబుపోలెఁ - దొయ్యలి దాపలితొడయును నదరె.
శుభసూచకంబు లీచొప్పున నడువ - నిభరాజగమన నయ్యెడఁ దెంపు మాని440
జనకుని శ్రీరామచంద్రుని నతని - యనుజుల నత్తల నటఁ దలంచుచును
దనుజులచేతి బాధలఁ జాల నలసి - తనదిక్కులేమికిఁ దరళాక్షి వగవ
“సుదతిచిత్తములోని శోకంబు మాన్ప - నిది నాకుఁ దఱి"యని యిచ్చఁ జింతించి
రవికులక్రమమును రామపౌరుషము - వివిధభంగుల వేడ్క వినుతి సేయుచును
మానిమీఁదనె యుండి మారుతాత్మజుఁడు - వానరభాష గీర్వాణభాషయును
ఈనాతి యెఱుఁగునో యెఱుఁగదో యనుచు - మానవభాషల మగువ కిట్లనియె.
“ఓమహినందన! యోపుణ్యసాధ్వి! - యీమెయి శోకింప నేటికి నీవు?
మగువ! నీవిభుఁడు సేమముగ నున్నాఁడు - జగదేకనిధి రామజనపాలవిభుఁడు
వనధి బంధించి రావణు సంహరించి - నినుఁ దోడుకొనిపోవు నిక్క మీపలుకు;
సహజన్ముఁడైన లక్ష్మణుఁడు తన్ గొలువ - మహనీయమహిమతో మాల్యవంతమున450
నున్నాఁడు కపిసేన లొగి ననేకములు - త న్నర్థిఁ గొల్వఁగా దశరథాత్మజుఁడు"
అనవుడు నిది యొక్కయాకాశవాణి - యని శింశుపావృక్ష మవనిజ చూడఁ
బన్నిన నీలాభ్రపటలంబులోనఁ - గ్రొన్నెలగతి మెఱుంగును బోలెఁ జూడ
సన్నమై యామ్రానిశాఖలనడుమ - నున్నమర్కటరూప మొయ్యనఁ గాంచి
కలలోనఁ బ్లవగంబుఁ గంటి నే ననుచుఁ - గలఁగి యాకలకీడు కాకుత్స్థజులకుఁ
గాకుండుఁగా! కంచు ఘనులు దేవతల - నాకాంత గొనియాడి యటఁ దెలివొంది
కంటకాసురకోటి గాఱించుకతనఁ - గంటికి నిదుర నేఁ గాన రేఁబగలు
గాన నిద్దురలేని కల యెందుఁ గలదు? - పూని యింకొకసారి పోలంగఁజూతు
నని తనవదనాబ్జ మల్లన నెత్తి - హనుమంతు మఱియును నందందఁ జూచి
"యెందుండి వచ్చెనో యీమ్రానిమీఁది - కెందును గడుఁజిత్ర మిది యొక్కకోఁతి460
చెలు వొప్ప నరుఁడు భాషించుచందమున - నలినాప్తుకులము నానాథుసేమంబు
నలవడఁ దెలుపుచు నమృతంబు లొలుకఁ - బలుమాఱు ప్రియములు పలుకుచున్నదియు
వానరజాతి కీవార్తలు గలవె - నానావిధంబుల నాకుఁ జింతింప