పుట:Ranganatha Ramayanamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రిజటాస్వప్నము

అంత నాత్రిజటయు నవనితనూజ - సంతాప మటుఁ జూడఁజాలక తొలఁగి
నెలకొని యొకచోట నిద్రించి లేచి - కలఁగని రాక్షసకాంతలఁ జూచి
"యొక కలఁ గంటి నే నోయింతులార! - ప్రకటించి చెప్పెద పాటించి వినుఁడు
రాముఁ డేనుఁగు నెక్కి రాఁ జూడఁ గంటి - సౌమిత్రి భృత్యుఁడై చనుదేరఁ గంటి,
నామహాగజముపై యవనీతనూజ - కోమలి నెక్కించుకొని పోవఁ గంటిఁ,
బట్టాభిషిక్తుఁడై బ్రహ్మాదిసురలుఁ - గట్టిగాఁ గొల్వ రాఘవుఁ డుండఁ గంటిఁ,
గమనీయ మగుపుష్పకముమీఁదనుండి - బ్రమసి రావణుఁ డుర్విపైఁ గూలఁగంటిఁ,
గూలిన రావణుఁ గ్రూరాసి యొకతె - నీలాంబరముతోడ నెఱిఁ జేరఁ గంటి.410
చేరి రావణుతల ల్చెలు వేది కూల్చి - భూరిగార్దభములఁ బూనినరథము
నం దుగ్రమున వైచి యామ్యదిక్కునకుఁ - గొందలపడి యెత్తుకొని పోవఁ గంటి,
గురుతరోష్ట్రము నెక్కి కుంభకర్ణుండు - తిర మేది దక్షిణదిశ కేగఁ గంటిఁ,
దనరారు తోరణతతులతోఁ గూడ - వనధిలోపల లంక వడిఁ గూలఁ గంటి,
నతికాయ మకరాక్షు లాయింద్రజిత్తు - ప్రదనవిక్రము లుర్విపైఁ గూలఁ గంటి.
గనకపీఠంబుపైఁ గారుణ్యమూర్తి - యొనర విభీషణుం డుండంగఁ గంటి,
రావణుమరణంబు రఘురాముజయము - నీవిధంబున సిద్ధ మిటమీఁద నింక;
నటుగాన మీర లీయవనీతనూజఁ - బటుదుష్టభాషల భర్జింపవలదు;
తొలఁగి పొం" డనవుడు దొలఁగి నిద్రించి - యలసి రాక్షసభామ లంద ఱున్నంత;
నాసమయంబున నవనీతనూజ - గాసిల్లి భయశోకకంపిత యగుచుఁ420
దన్ను రెణ్నెలలకు దయమాలి చంపు - నన్న రావణుమాట లందందఁ దలఁచి
శోకంబు గ్రమ్మ నశోకంబుకొమ్మ - యాకొమ్మ యూఁతగా నటు లేచి నిలిచి

రాక్షసస్త్రీల బాధలకు జానకి పలవించుట

లోలత నడవులలో నొంటిఁ బడిన - బాలికయును బోలెఁ బలవింపఁ దొణఁగె,
“అక్కటా దైవంబ! యదయత నన్ను - నిక్కడఁ జెఱఁబెట్టి యిటు లేఁచఁ దగునె?
ఖలదైత్యుచేఁ జావఁగలవు నీ వనుచు - నలినసూతి లిఖించినాఁడొ నానొసటఁ?
గాకున్న మఱి దండకావనంబునకుఁ - గాకుత్స్థకులుఁడు రాఁ గారణం బేమి?
పైడిమృగంబు నన్ భ్రమియింప నేల? - వీఁ డిటు చెఱఁదెచ్చి వెతఁ బెట్ట నేల?
నా కేమి చింతింప నాకూర్మివిభుఁడు - లోకరక్షణకళాలోలమానసుఁడు
రాకేందువదనుండు రామచంద్రుండు - నాకుఁ గా ఘోరకాంతారమధ్యమున
సౌమిత్రియును దాను జాలిమైఁ దూలి - యేమి గాఁ గలవాఁడొ? యె ట్లున్నవాఁడొ?
యెన్నఁ డాఘనశౌర్యుఁ డిట కెత్తివచ్చు? - నిన్నీచదైత్యుల నెన్నఁ డుక్కణఁచుఁ?