పుట:Ranganatha Ramayanamu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కడు సిగ్గుపడి చాల కలుషించి సీత - కడనున్నదుష్టరాక్షసవధూజనుల
నతిదీర్ఘతనుల భయంకరాకృతుల - సతతనిష్ఠురవాక్యసమరకర్కశుల
వినతనయోముఖి వికటహేమాస్య - యనుదాని హరిజట యనుదానిఁ ద్రిజట
ప్రఘసమహోదరిఁ బాటించి పిలిచి - లఘువృత్తిఁ బలికే నిర్లజ్జుఁడై నిలిచి
"ప్రియనయోక్తులచేత బెదరించి యైన - భయదచేష్టల నైన బాధించి యైన
మాసద్వయంబున మగువ నాసొమ్ము - చేసి తెం డిటు మీరు సేయలేకున్న
నంతటిమీఁద నయ్యబ్జాక్షిఁ జంపి - యింత లింతలు కండ లిందఱు గొనుఁడు"
అని యశోకారామ మాప్రొద్దు కదలి - తననగరికిఁ బోయె దనుజవల్లభుఁడు.380

రాక్షసస్త్రీలు సీతను బెదరించుట

అపుడు జానకి దానవాంగన లెల్లఁ - గృప మాలి తమతమకృతకవాక్యముల
బోధించి రావణుఁ బొందు మీ వనుచు - బాధించుతఱి శూలపాణియై యొక్క
రక్కసి బెదరించి రాముఁ డీలంక - దిక్కు చూడఁగ లేఁడు తెఱవ! యాయాస
విడు మంచు నొక యింతి వెడనీతిఁ బలుకు - మిడుమలఁ బడియుండ నేల నీ కిట్లు?
వరియించు దానవేశ్వరునిఁ గాదేని - పొరిగొందు నని యొక్కపొలతి భర్జించుఁ
దెండు ఖడ్గము తల తెగఁగొట్టి దీని - కండలు కమ్మగాఁ గల్లుతో నద్ది
చవిచూత మని యొక్క జంత మారొలయు - నవు నవు నటు సేయుఁడని యోర్తు పదురు
నీరీతిఁ బెదరింప నిందీవరాక్షి - ధారణితనయ కొందలమంది కుంది
కన్నీరు దొరుఁగ గద్గదకంఠ యగుచుఁ - దన్ను గాఱించు దైత్యస్త్రీల కనియెఁ.
“దలఁప మానవులకు దానవులకును - గలుగునే దాంపత్యగౌరవశ్రీలు?390
ఇందఱు దుర్భాష లి ట్లాడనేల? - చంద్రుని బాయని చంద్రిక వోలె
భానుని బాయని ప్రభయును బోలె- నేను శ్రీరఘురాము నెడఁబాయఁజాల;
నానృపాలుఁడు దీనుఁ డైనను రాజ్య - హీనుఁ డైనను నాకు నిష్టదైవంబు
జలధికన్యకరీతి శర్వాణిభాతిఁ - బలుకుఁదొయ్యలిమాడ్కిఁ బౌలోమిమాడ్కి
రోహిణిసరణి నరుంధతికరణి - స్వాహాంగనాగతి సావిత్రిమతిని
రతిచందమునఁ బతివ్రతనిష్ఠఁ బొదలి - పతియైన రఘురాము భజియించుదానఁ
జంపినఁ జంపుఁడు శాతాసి శిరము - తెంపినఁ దెంపుఁడు ధృతి రాముఁ గాని
యితరుల నే నొల్ల; నిటువంటికల్ల - మతముల నే నొల్ల; మానుఁ డిం" కనిన
మండుచు వార లామాటకు మిగులఁ - గండక్రొవ్వునఁ బెక్కుగతులఁ గాఱింప
ధూళిధూసరితయై తూలి లోదారి - నీలాహి బోలిన నెఱివేణి చెదర400
నేలపైఁ బడి వేఁడినిట్టూర్పు నిగుడ - "హా లక్ష్మణా! యంచు హా రామ! యనుచు
హా యత్త కౌసల్య!" యనుచు నెల్గెత్తి - యాయుత్తమాంగన యార్తిమై నేడ్చె.