పుట:Ranganatha Ramayanamu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమరారిచేత నాయసువెల్లఁ బొలసి - సమరంబులోపలఁ జచ్చితి నేని?
లంకది క్కెఱుఁగక లలన నెవ్వగల - నింకుచు నిందున్కి యెఱుక చొప్పడక
యేను జచ్చుటయును నేర్పడ వినక - భానుకులాగ్రణి ప్రాణము ల్విడుచు;
నింత చేసినచేత లేమియుఁ గాక - నంతయుఁ జెడిపోవు నధిపుకార్యంబు
ఎడపక నిటమీఁద నీదైత్యుతోడఁ - గడఁగి కయ్యము సేయఁగలవాఁడఁ గాను
దనుజుతోఁ బోరాడి దర్పించి గెలుతు - నని తలంచిన గెల్పు నది గానరాదు”
అని నిశ్చయము చేసి యాత్మలో మున్ను - దనుజుతోఁ బోరుట తగవు గా దనుచు
నెలఁతను దర్శించి నిష్ఠతోఁ బిదపఁ - గలకార్యములు సేయఁగలవాఁడఁ గాని,
అని సేయ నిది సమయము గాదు నాకు" - నని ధీరుఁడై యుండె నామ్రానిమీఁద350
మఱియు రావణుఁడు కామంబు ప్రేమంబు - వెఱపును నొఱపును వెఱుగును గదుర
నాడినమాటల కన్నిటి కాత్మ- నోడక యతినిష్ఠురోగ్రవాక్యముల
వనిత లందఱు విన వసుధాతనూజ - తను దూరఁబల్కిన దనుజేశుఁ డంతఁ
గుటిలభావమున భ్రూకుటిలసన్నిటల - చటులరక్తాస్యుఁడై జాజ్వల్యమాన
లోలకీలాభీలలోకసంహార - కాలాగ్నిరీతి నాగ్రహమున మండి
ఘోరహుంకారుఁడై క్రూరుఁడై నీతి - దూరుఁడై యాసీతఁ దొడరి భర్జించి
చంద్రహాసం బెత్తి జానకి నేయ - నింద్రారి గమకించునెడఁ గేలుఁ బట్టి

మండోదరి రావణునికి నీతిఁ దెల్పుట

యమలమండోదరి యడ్డమై నిలిచి - కొమరొప్పఁ బలికే నాకు మతి యౌ విభుని
“దండిమై నెదిరిన ధరణిపాలకుఁడె - ఖండింప నీకు నీకాంత దైత్యేశ!
యెన్ని చెప్పిన విన వేమి సేయుదును? - ని న్ననఁ బని యేమి? నీపురాకృతము360
ముచ్చిలి పరసతి మునుఁ దెచ్చు టొకటి - చెచ్చెఱ భువి నిండఁ జెందుట రెండు;
తెగువతోడుతఁ బట్టి తెచ్చినమొదలు - పగఁగొని యుండు టేర్పరుపఁగా మూఁడు;
ఒనర దుర్బుద్ధి నాయువిదను గూడి - యనుభవించెద నను టారయ నాల్గు;
కన నుత్తమస్త్రీలఁ గడఁగి పల్మాఱు - వినరానిపల్కులు వెసఁ బల్కు టేను;
గామ మణఁపలేక కామినిఁ జంపఁ - దా మది నెంచుట దనుజేశ యాఱు;
తగ వేంచనేర కెంతయుఁ జేసి తుదిని - మగఁటిమి వోవుట మఱియును నేడు
నేఁడుచేటులు నయ్యె నీయింతివలన - నేఁడు గడపఁగరాదు నిజముగా నెన్నఁ
బొరి పాతకంబులఁ బుట్ట యీమేను - దొరఁగిన సద్గతి దొరుకునె నీకు?
నభిమానవతి మానవాంగన సీత - కభిలాషపడి యింత కలుగంగ నేలి,
నీయంతిపురమున నెలఁతలలోన - నీయింతి చింతింప నెవ్వారిఁ బోలు?370
ననుఁ గూడి క్రీడింపు నాథ! యీచెంత - నినువంటివానికి నీతి గా దెందుఁ;
తొలిసెనే నీబుద్ధి పోపొ" మ్మటంచుఁ - బలిమిఁ దొలంగించెఁ బతికేలు వాలు