పుట:Ranganatha Ramayanamu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదహస్తితో దోమ మార్కొన్నకరణి - నుదధితోఁ గాల్వ మెండొడ్డినపగిది;310
శ్రీతర్వుతో వేము, శ్రీశుతో జోగి - ధాతతో విప్రుండు, ధనికుతోఁ బేద
జాతిరత్నముతోడ సరి గాజుపూస - భూతలంబున సరిపోల్చిన యట్లు
తెగువమై రాఘవాధిపునకు నీకు - మగఁటిమి మదహస్తిమశకాంతరంబు
మిగుల నోరులు గల్గి మీఱి పల్కెదవు - జగతి రామునితోడ సరియె రాక్షసుఁడ!
ఒకలంకయేలుచు నుబ్బెద వీవు - సకలలోకములకు స్వామి రాఘవుఁడు;
అఖిలకంటకుఁడ వీ వన్నిలోకముల - నఖిలలోకారాధ్యుఁ డారాఘవుండు;
వేదచోరుఁడ వవివేకివి నీవు - వేదంబులకు నెల్ల వేద్యుం డతండు;
కర్మపూరితఘనకాయుండ వీవు - నిర్మలగుణయశోనిధి రాఘవుండు;
సర్వజీవాళిభక్షకుఁడవు నీవు - సర్వజీవులకును సముఁడు రాఘవుఁడు;
ఉన్నతోన్నతుఁ డైన యుర్వీశునకును - ఎన్నిసారెల పెట్ట నెఱుఁగంగ నీవు320
ఇందుసూర్యాగ్నిసురేంద్రులు గారు - ఇందుధరార్చితుం డినవంశజుండు
ని న్నిట మర్దించి నీరూప మణఁచి - నన్నుఁ దోడ్కొనిపోవు నమ్ము మింతటికి
నాకు నీకును సాక్షి ననుఁ దెచ్చునపుడు - గైకొని యొకపక్షి కడఁగి యేతెంచి
నీలావుశక్తియు నీపరాక్రమము - నేలపాలుగఁ జేసి నెఱి వ్రేసి నిలువఁ
గపటభాషలు పల్కి ఘనపక్షినాథు - నపుడు ఖండించిన యధముఁడ వీవు
తర మెఱుంగక రామధరణీశుతోడఁ - దొరలితే భస్మమై త్రుంగెదుగాక!
యేమిటి కెదురు ద న్నెఱుఁగనిమాట - లేమిటి కీగర్వ మినకులేశ్వరుఁడు
ఈమూఁడుజగముల నెందు డాఁగినను - ఈమెయి ని న్నేల యి ట్లుండ నిచ్చు?”
ననిన రావణుఁడు మహారోషదృష్టి - జనకజ మఱిఁ జూచి చలముతో ననియెఁ.
“బరమేష్ఠిఁ దపమునఁ బరఁగ మెప్పించి - వరశక్తి నతనిచే వరములు గాంచి330
సురపతిమొదలుగా సురల నోడించి - గరళకంధరుతోడఁ గైలాస మెత్తి
కడిమిమై నూర్ధ్వలోకములు సాధించి - వడిఁ బేర్చి పాతాళవాసుల నోర్చి
సకలోన్నతుండ నై సడి గన్న నన్ను - వెకలియై తమతండ్రి వెడలంగఁ ద్రోవ
నతిహీనసత్త్వుఁడై యడవులలోన - బతిమాలి ఫలములఁ బర్ణాశనముల
వికృతాంగుఁడై తపోవృత్తిమై నన్ను - యొక పేదమానవుఁ డోపునే చెనక?"
నని రాము నిందింప నందందఁ బొగిలి - మనమున నొగిరి యుమ్మలికంబు మిగిలి
ఘనశోకగద్గదకంఠయై యప్పు - డినకులాధిపుదేవి యెలుగెత్తి యేడ్చె.
ధృతి దూలి నలుగడ దేవగంధర్వ - సతు లెల్ల నేడ్చిరి జానకిఁ జూచి;
రావణుగర్వంబు రమణిశోకంబు - భావించి కోపతాపంబులు నిగుడ
ననిలతనూభవుఁ డప్పు డాదుష్ట - దనుజుపై లంఘింపఁ దలపోసి చూచి340
"బిరుదనై వీనిఁ జంపితినేని పతికి - ధరణిజసేమంబుఁ దగఁ జెప్పఁగలను;