పుట:Ranganatha Ramayanamu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానక కైకొందు మగువ ని న్నింకఁ - గాన నామాటలు గైకొని వినుము;
ఈరూపమున నుండ నేమి కారణము? - దారుణాటవి దాఁటి తమ్ముఁడుఁ దాను280
వనిత! రాముఁడు వచ్చి వనధి బంధించి - పనిచినకడిమిమైఁ బద్దు సాధించి
గొనకొన్న వేడ్కతోఁ గొనిపోవు నిన్ను - నని విచారించెద వాత్మలో నీవు
అమరేంద్రయమవరుణాదుల కైన - సమరంబులో నన్ను సాధింపరాదు;
ఈబేలతన మేల? యిందీవరాక్షి! నాబాహుశక్తి నరు లెంతవారు?
అడవుల నాకులు నలములు నమలి - యిడుములు పడుచున్న హీనమానవుని
పొం దేల కోరెదు? పొలఁతి! నన్ బొంది - పొంద నొల్లవె? రాజ్యభోగంబు లకట!
యనిమిషాధిపుఁ డైన నంతకుండైన - విను జలాధిపుఁ డైన విత్తేశుఁ డైన
ననలనైరృతివాయుహరిహరు లైనఁ ృ జనుదెంచి యీలంక సాధింపలేరు;
లంక మానవులకు లక్షింపఁ దరమె - యింక నెక్కడి రాముఁ? డిందెటు వచ్చు?
వచ్చి లంకాపురవర మెట్లు చొచ్చుఁ? జొచ్చిన నెబ్భంగి స్రుక్కక యెదురు290
నెదిరి నన్ బొడఁగని యెబ్భంగిఁ గదియు? - గదిసి నాసత్త్వ మేగతి సైఁపఁజాలుఁ?
జాలుట యెందాఁక సమకూరఁ బోలుఁ ? - బోల ఏమాటలు పో విడు మింతి;"

జానకి రావణుని దిరస్కరించుట

అని యిట్లు పలుమాఱు నరమి రావణుఁడు - వినరానిపలుకులు వెస దూఱి పలుకఁ
గడు నల్గి గద్గదకంఠంబుతోడఁ - బుడక ద్రుంచి యవశ్యమును రాముచేతఁ
జెడుదు నీ వని చాటి చెప్పినరీతిఁ - బడఁతుక తృణము చేపట్టి యిట్లనియె.
"పాపాత్మ! నీవు నా పతి డాఁగురించి - యేపున లంకలోనికి నన్నుఁ దెచ్చి
యిది యొక్క కడిమిగా నేల గర్వించె? - దిది యొక్కమేలుగా నేల ప్రేలెదవు?
పరవధూరతిఁ గోరు పాపాత్మకులకు - సిరియు నాయువు కీర్తి చెడు నటుకానఁ
దగవును ధర్మంబు తలపోసి నన్ను - మగుడ రామున కిమ్ము మనఁగోరితేని?
కాదేని దుర్బుద్ధి గైకొంటివేని? - కోదండదీక్షాదిగురునిచే రామ300
జననాథుచే నీవు చచ్చుట నిజము - వనవాసకృశుఁడు కేవలదుర్బలుండు
ననద రాజ్యవిహీనుఁ డసహాయుఁ డతఁడు - మనుజమాత్రుఁ డటంచు మది నెన్నవలదు
దండకాటవి చతుర్దశసహస్రోగ్ర - చండరాక్షసకోటిఁ జంపఁడే తొల్లి?
దండధరోద్దండదండంబు నొడిసి - చండాంశుకిరణోగ్రసంరంభ మణఁగ
గణనాపరంపర ల్గడచి యందంద - రణభీషణము లైన రాముబాణములు
పరువడి నీలంకపైఁ బాఱునాఁడు - తరమిడి నీయురస్థలి గాడునాఁడు
మునుకొని నీశిరంబులు ద్రుంచునాఁడు - మునుమిడి నీరక్తములు గ్రోలునాఁడు
రావణ! నీలావు రఘురాములావు - నీవు చూచెదు గాని నే నేల చెప్ప?
నెండతోఁ బ్రాలేయ మెదిరించినట్లు - కొండతో దగరు మార్కొనిన చందమున