పుట:Ranganatha Ramayanamu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెబ్భంగిఁ జూపుదు నింక నారూపు - నెబ్భంగి భాషింతు నీయింతితోడ
నెబ్భంగి నూరార్తు నీపుణ్యసాధ్వి నెబ్భంగి నిబ్భంగు లెఱిఁగింతు సతికి?”

రావణుఁడు సీతాదేవివద్దికి వచ్చుట

నని యిట్లు చింతింప నంత రావణుఁడు - జనకజఁ జింతించి సంతాప మంది250
వేకువజామున వేగ మేల్కాంచి - తేకువ మనసిజాధీనచిత్తమున
దివ్యమాల్యంబులు తెఱఁగొప్ప ముడిచి - దివ్యగంధంబులు తెఱఁగొప్పఁ బూసి
దివ్యాంబరంబులు తెఱఁగొప్పఁ గట్టి - దివ్యభూషణములు తెఱఁగొప్పఁ బెట్టి
తనకిరీటప్రభాతతు లెందుఁ బర్వ - ఘనచంద్రహాససంకలితుఁడై పేర్చి
కరమణికంకణక్వణనము ల్మెఱయ - సరస నచ్చరలు వింజామర లిడఁగ
ఘనకుచహారము ల్గ్రాల గంధర్వ - వనితాజనము లాలవట్టము ల్పట్ట
గొడుగును ధరియించి కుచమూలరుచుల - నడయాడుచున్న కిన్నరసతు ల్నడువ
బాహుపార్శ్వంబులఁ బరఁగంగ హస్త - వాహికలై యక్షవనితలు నడువఁ
బరిమళోదకపానపాత్రిక ల్పట్టి - గరుడకామిను లిరుగడల నేతేర
నెడనెడ సందడి నెడగల్గ జడిసి - కడఁగి ముందట నాగకన్యక ల్నడువ260
విద్యాధరస్త్రీలు వీణాదివాద్య - హృద్యసంగీతంబు లింపుగాఁ బాడఁ
దనగుణోన్నతు లొగిఁ దగ సిద్ధసాధ్య - వనితలు చేరి కైవారము ల్సేయ
బాగొప్ప వరఖడ్గపాణులై కదిసి - రాగిలి వెనుక నారాక్షసస్త్రీలు
కలగొనఁ గరదీపికాసహస్రములు - వెలుఁగ మండోదరి వేడ్కఁ దోడ్కొనుచు
మెఱుఁగుల వెనుకొను మేఘంబు పోలె - మఱియును గల సతు ల్మలసి త న్గొలువ
నురుపాదహతి నోలి నుర్వి గంపింపఁ - బరిహాసరవము లంబరమును గప్ప
మంజీరమేఖలామణిభూషణాది - శింజితంబులు విందు సేయ వీనులకు
నాయశోకారామ మపుడు సొత్తెంచె - వాయుసూనుఁడు దన్ను వాంఛతోఁ జూడ
నిద్రావశేషఘూర్ణితదృష్టితోడ - భద్రకేయూరాంకబాహులతోడ
వసుధపై జీరాడు వలెవాటుతోడ - వసివాళ్లు వాడిన వదనంబుతోడ270
ఘనతరభీషణాకారంబుతోడ - జనకజముందఱఁ జనుదెంచి నిలిచె.
నిలిచిన భీతిల్లి నివ్వెఱగంది - తలఁపులో రఘురాముఁ దప్పక నిలిపి
యూరులు నుదరంబు నురుకుచద్వయము - చారుహ స్తంబులఁ జక్కఁగా నుంచి
పులిఁ గన్నలేడిని బోలె చిత్తమునఁ - గలఁగుచున్నట్లున్న కల్యాణిఁ జూచి
వవితలలోన దుర్వారగర్వమునఁ - దను దైవమాడింపఁ దగవేది పలికె.
“నింతి! నీతనుమధ్య మిఁక దాఁచ నేల? - కాంత నీనెమ్మోము గైవ్రాల నేల?
పొలఁతి! బల్మిని బట్టి భోగించువాఁడ - నెలఁత! యీగుణములు నెఱి గనుంగొనుము;
వనిత! యీగుణముల వఱలెడు నన్నుఁ - గొనుము నీయనుమతిఁ గోరియున్నాఁడ;