పుట:Ranganatha Ramayanamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘోరరాక్షసవధూకోటిలో నున్న - నారీశిరోమణి నలినాయతాక్షి
మలినాంగి యలివేణి మాతంగగమన - కలితభూషణజాల గద్గదకంఠి
జనితోష్ణనిశ్వాస సతతోపవాస - జనకతనూజాత జగదేకమాత
నిఖిలసన్నుతపూత నిర్మలఖ్యాత - యఖిలగుణోపేత యయిన యాసీతఁ
బొడఁగని సీత గాఁబోలుఁ బొ మ్మనుచుఁ - గడుభక్తి రామలక్ష్మణులకు మ్రొక్కి220
కడువేడ్క సురలను గడఁగి వేఁడుచును - నడరెడు ముదమున నామేడ డిగ్గి
మది నుబ్బి యంగుష్ఠమాత్రుఁడై కదిసి - పదిలుఁడై యాశింశుపావృక్ష మెక్కి
బాలుఁడై యల వటపత్రంబునందు - వేలీలఁ గ్రీడించు విష్ణుఁడు పోలె
శాఖామృగేంద్రుండు జడిగొన్న దాని - శాఖలలో డాగి చతురుఁడై యుండెఁ.
బావనచరితుఁ డాపద్మాయతాక్షి - భావించి భావించి పలుమాఱుఁ జూచి
కడఁకతో ఋశ్యమూకమునందుఁ గన్న - తొడవులు నీయున్నతొడవులు జూడ
నేకప్రకారంబు లీపద్మనయన - కాకుత్స్థసతి సీత గాఁబోలు ననుచు
మఱియును బఱికించి మారుతాత్మజుఁడు - నెఱసినబుద్ధిమై నెలఁత నీక్షించి
శ్రీరాముఁ డానతిచ్చినప్రకారమున - నారమణీమణియవయవ శ్రీలు
కర్ణ వేష్టనములు కరకంకణములు - స్వర్ణాంబరంబును సరిఁ బరికించి230
వలవంతఁ బడి వ్రేగువారిచిహ్నములు - వలనొప్పఁ గల పతివ్రతలచిహ్నములు
చదురుగల్గిన మర్త్యసతులచిహ్నములు - చెదర కన్నియుఁ జూచి చింతించి మఱియుఁ
గొనకొని రాముఁ బేర్కొని ప్రలాపింపఁ - గనుఁగొని మఱి సీతగా నిశ్చయించి
యావిన్ననగుమోము నాకృశాంగంబు - నావిరసినవేణి యాయున్నయునికి
యాదురవస్థయు నావిలాపంబు - నాదైన్యమును జూచి యాత్మ శోకించి
“చంద్రునిఁ బాసిన చంద్రికరీతి - చంద్రాస్య యారామచంద్రునిఁ బాసి
యుండునే యీయింతి నొగిఁ బాసి రాముఁ? - డుండునే యిది చోద్య మూహించి చూడఁ
గులశీలదాక్షిణ్యగుణవయోధర్మ - లలితరూపము లొక్కలా గౌటఁ జేసి
యారామువిభున కీయంగనామణియు - నీరామ కారామనృపతియుఁ దగును.
ఈకాంతకై కాదె యినకులేశ్వరుఁడు - శ్రీకంఠువిలుఁ ద్రుంచెఁ జెఱకుచందమున240
దొలుతఁ బట్టినయంతఁ ద్రుంచె విరాధు - నలి గోసె నాశూర్పణఖ ముక్కు చెవులు
ఖరదూషణాది రాక్షసుల ఖండించి - మరణంబు నొందించె మారీచు నీచు
వాలి నొక్కమ్మున వధియించి కపుల - నాలుగుదిశల కున్నతశక్తిఁ బనిచె
వారిలోపల నన్ను బలవంతుఁ డనుచు - నారూఢగతి నంగదాదులఁ గూడి
ఘనపుణ్యనిధి యైన కాకుత్స్థు నెదురఁ - బనిబూని వచ్చితిఁ బంతంబు మెఱసి
నాపుణ్యవశమున నాకోరినట్టు - లీపుణ్యవతిఁ గంటి నిచ్చోట వచ్చి;
దారుణాసురవధూతతినట్టనడుమఁ - గారణాకృతిఁ జిక్కి గలఁగు నీసతికి