పుట:Ranganatha Ramayanamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒండుదేశంబుల నునిచెనో? కాక - దండించి చంపెనో తరలాక్షి నసుర?
యేమని మగుడుదు నేమందుఁ బోయి - యేమి చేయుదు నింక నిటమీఁద నేను
వామాక్షిఁ గానక వచ్చితి ననిన - రాముఁ డప్పుడే పాయుఁ బ్రాణవాయువుల
నన్నకై సౌమిత్రి యడుగు నీవార్త - విన్నంత భరతుండు విడుచుఁ బ్రాణముల
నతనికై శత్రుఘ్నుఁ డఖిలబాంధవులు - హతు లౌదు రినవంశ మంతట సమయ
నది చూచి సుగ్రీవుఁ డాయంగదుండు - మొదలైన కపివంశమును నాశ మొందు190
గాన వానప్రస్థుగతి మహాటవుల - నేను గాపుండుదు; నిదియుఁ గాదేని?
సొదఁ బేర్చుకొని యగ్నిఁ జొత్తు నొండేని? యుదధులఁ బడి చత్తు నుసు రాసఁ దక్కి
యక్కట! సంపాతి యాడినమాట - నిక్కంబుగా నమ్మి నీరధి దాఁటి
యిచ్చటి కొంటిమై యే వచ్చుటెల్ల - నచ్చుగా వృథ యయ్యె నౌఁగాక యేమి?
త్రిదశులతోఁగూడఁ దెగువమైఁ బేర్చి - త్రిదశేంద్రుఁ బట్టి బాధింతు నొండేని?
చెలఁగి కీలలతోడ శిఖి నీటముంచి - యిలఁ బ్రామి ప్రభలు మాయింతు నొండేని?
క్రందుగా జముని గింకరులతోఁ బట్టి - డెందంబుఁ బగుల దండింతు నొండేని?
చలమొప్ప నిరృతిరాక్షసులతోఁ గూడఁ - బెలుకురఁ బట్టి నొప్పింతు నొండేని?
కరువలి నయ్యేఁడు గాడ్పులఁ బెనచి- కెరలి యందంద శిక్షింతు నొండేని?
నలిరేగి ధనదుఁ గిన్నరులతోఁ బట్టి - చెలువేది కూల భర్జింతు నొండేని?200
యెనయఁ బ్రమథులతో నీశానుఁ బట్టి - చెనసి యొండొండ శిక్షింతు నొండేని?
కుతలంబుఁ గిరులతోఁ గుమ్మరసాలె - గతిఁ ద్రిప్పి యుక్కడఁతు నొండేని?
యీలంకదైత్యుల నీయబ్ధి ముంచి - లీలమైఁ గలఁచి కాఱింతు నొండేని ?
యే నింత చేసిన నెల్లదేవతలు - నానతులై వచ్చి యతివఁ జూపెదరు;
కాకున్న రాఘవు ల్కరుణమైఁ దామె - యీకీడు వలదని యింక మాన్పెదరు:”
అని నిశ్చయము చేసి యామేడశిఖర - మనిలనందనుఁ డెక్కె నాసమీపమున
వాయువు నెండయు వడిఁ జొరరాని - యాయశోకవనాంతరావళిలోన

హనుమంతుఁడు సీతను జూచుట

నెలమి జొంపరి గూడ హేమవర్ణమున - విలసిల్లు శింశుపావృక్షంబుక్రింద
వ్రతములఁ గడు డస్సి వనటులఁ గ్రుస్సి - యలిదుఃఖములఁ గుంది యాత్మలోఁ గంది
విపులాశ్రువుల దోఁగి విరహాగ్నిఁ గ్రాఁగి - కపటవృత్తులఁ జిక్కి కడుముట్ట స్రుక్కి210
జీవంబుపై రోసి చెలువంబుఁ బాసి - యావిధి మది దూఱి యలసత మీఱి
చెక్కిటఁ జెయిఁ జేర్చి చింతల కోర్చి - దిక్కులేమిఁ దలంచి ధృతి దూరడించి
యినరశ్మి వాడిన యెలదీఁగెఁ బోలె - ఘనధూమయుతదీపకళికయుఁ బోలె
జలదమాలికలోని శశికళవోలెఁ - బలుమంచుఁ బొదివిన పద్మిని వోలె
చెలఁగి పిల్లులలోని చిలుకయుఁ బోలెఁ - బులులలో నావును బోలె దుర్వార