పుట:Ranganatha Ramayanamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నని పల్కిచనుటయు నావధూమణియు - మనమున నలరుచు మఱి వాయుదేవు
ప్రవిమలకృప నిన్నుఁ బడసెఁ గావునను - భువిని వాయువుతోడి భూరిసత్త్వుఁడవు
వేగవిక్రమకళావిస్ఫూర్తియందు - నాగరుడునికంటె నధికుండ వీవె;
వరుసఁ బంకజగర్భువరమునఁ జేసి - మఱి నీకు నాయుధమరణంబు లేదు;1190
నీసమానులు లేరు నిఖిలలోకములు - నీసత్త్వ మెఱుఁగుదు నిజముగా నేను
జలనిధి లంఘించి జనకజఁ గాంచి - కలఁకమై యిటు రామకార్యంబుఁ జేసి
కపులప్రాణములు రాఘవులప్రాణములు - కపినాథుప్రాణము ల్గరుణతోఁ గాచి
తడయక యో జగత్ప్రాణనందనుఁడ! - పడయు ముత్తమలోకపదములు నీవు”
అనవుడు హనుమంతుఁ "డౌగాక! మీరు - పనిచినఁ జేయుదుఁ బతికార్య మొనర
నగచరు ల్సూడుఁడు నాశక్తి నేఁడు - జగదేకహితయుక్తి జలధి లంఘించి
పఱతెంచి సుర నడ్డపడిన సాధింతు - నెరసి లోకములెల్ల నీఱు గావింతు;
నక్కజంబగు శక్తి నటు లంకఁ జొత్తు - స్రుక్కక వైదేహిఁ జూచి నే వత్తు;
నాలంక యైనను నగలించి తెత్తు - వాలాయముగ సీత వసుధేశుఁ గూర్తుఁ;
గాకున్న జలధులు గలఁతు నొండేని? - వీఁకతో నమరాద్రి విఱుతు నొండేని?1200
పుడమి తుత్తుమురుగాఁ బొడుతు నొండేని? - తొడరి మృత్యువు నైనఁ ద్రుంతు నొండేని?
దీవు లన్నియును శోధింతు నొండేని? - చేవ మీఱఁగ లంకఁ జేరి యచ్చోట
దుష్టాసురుల నెల్లఁ ద్రుంతు నొండేని? - సృష్టి చీఁకటి చేసి చెఱుతు నొండేని?
కాని యారక రాను గడఁగి మీకడకు - నే" నని పూని మహేంద్రాద్రి యెక్కి,

హనుమంతుఁడు సముద్రమును దాఁటుట

యుదధులతోఁ గూడ నొగి సృష్టి గ్రుంగఁ - గదిసిన లయకాలకాలుఁడో యనఁగ
వెసఁ ద్రివిక్రముఁ డైన విష్ణునిరీతి - నసమానదేహుఁడై యందందఁ బెరిఁగి,
యంగదాదులచేత ననుమతి వడసి - యంగమంతయుఁ బొంగ నంతరంగమునఁ
దనతండ్రి పవమానుఁ దలఁచి శ్రీరామ - జననాథుపదపంకజము లాత్మ నిలిపి
యడుగులు తిరముగా నద్రిపై మోపి - మెడ యెత్తి యొక్కింత మెయిఁ గ్రుంగ నిలిచి
బొమ లెత్తి కలయ నంభోరాశిఁ జూచి - యమరారిపురిమీఁద నట దృష్టి నిలిపి1210
వఱలంగ నిలమీఁద వాల మల్లార్చి - నెఱి కర్ణములు రెండు నిక్కించి పొంచి
యట నద్రిశిలమీఁద హస్తంబు లూఁది - పటుజవంబున దాఁటెఁ బవమానసుతుఁడు
అల సుధాహరణార్థమై వైనతేయుఁ - డిలనుండి మును దివి కెగయుచందమున
నారభసంబున నద్రిశృంగములు - భూరేణువులకంటెఁ బొడియు నై రాలె
నారావణుండు ము న్నార్జించినట్టి - భూరికీర్తులపెంపు పొడి యైనయట్లు
నాయురవడి మ్రాఁకు లతనితో నెగసి - తోయధిలోఁ జొచ్చి తునియలై రాలె.
భావిసేతువునకై పవననందనుఁడు - తా వచ్చి శంకువు స్థాపించె ననఁగ
వెసఁ బేర్చి యచ్చట విషమవాయువులు - దెసలకుఁ జెడి పాఱెఁ; దివిరి మేఘములు
వక్రించె; లంకపై వాయుజుం డనుచు - శక్రాదులకుఁ జెప్ప జనినచందమున
నావడి నబ్ధి నీ రంతయు నెగసి - యావలి పాతాళ మటుఁ గానవచ్చె;1220
జనకజఁ దెచ్చి నాజలములో దాపుఁ - డని మారుతికిఁ జూపె నంభోధి యనఁగ