పుట:Ranganatha Ramayanamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయినను వినుఁడు ము న్నమృతంబుకొఱకు - దానవుల్ సురలు యుద్ధములు గావింప
నమరులకై సహాయంబుగా వచ్చి - యమృతంబు ద్రావితి నర్థి వా రొసఁగ
నుదధు లేఁడును దాఁట నోపు దస్తాద్రి - కుదయాద్రిపై నుండి యొకజంఘ యిడుచు
ఎల్లలోకముల నా కెదు రెందు లేదు - బల్లిదుఁడగుబలిబంధంబునాఁడు
ఇర్వదియొక్కమా రిలప్రదక్షిణము - తివిరి త్రివిక్రమదేవునిఁ గొలుచు1160
తరిఁ గొండ కాలిలోఁ దనరార విఱిగి - పరిఁబోయి మఱి జరాభారంబు నొదవె;
నరయంగఁ గడువృద్దు నైతి నిప్పటికిఁ - బరికింప నేను తొంబది గాని చాల
పొలుపొంద నీత్రోవఁ బోయెడుపనికి - వలతి గా" నని జాంబవంతుండు పలికె.
"తొంబదియేడు దోడ్తో దాఁటువాఁడ - నంబుధి" నని నీలుఁ డత్తఱిఁ బలికె.
నామారుతాత్మజుఁ డాత్మపౌరుషము - లేమియుఁ బలుక కయ్యెడ నూరకుండె.
“వాలినకడిమిమై వడి నూఱు దాఁటఁ - జాలుదు మగిడి రాఁజాలను గాని”
యని యంగదుఁడు పల్క నాజాంబవంతుఁ - డనఘ! మాకందఱ కధిపతి నీవు,
వాలితనూజ యీవారాశి దాఁటఁ జాలుదు మగిడి రాఁజాలవు నీవు ;
యువరాజ! వీకపియూథంబులకును - రవితనూజునియట్ల రాజవు గానఁ
దగ మమ్ముఁ బనిగొనఁ దగుఁగాక! యిట్లుఁ - దగునయ్య? నీ కింత దైన్య మేమిటికి?1170
రామకార్యపరుండు రవిజునిమంత్రి - యీమర్కటావలి కెల్లఁ బ్రాణంబు;
తక్కక పవమానతనయిండు గలుగ - నక్కటా! నీ కసాధ్యము లెందుఁ గలవు?
వల" దని వారించి వాయునందనునిఁ - బిలిచి యాతనితోడఁ బ్రియములు పలికి,

జాంబవంతుండు హనుమంతుని బ్రార్థించుట

"మారుతి! యీపని మామీఁదఁ బెట్టి - యూరకున్నాఁడవే? యుచితమె నీకు?
లలితలావణ్యవిలాసరూపముల - వలనొప్ప నప్సరోవనితలయందుఁ
బుంజికస్థలి యనఁ బొలుచు మీతల్లి - యంజన యటఁ దొల్లి యగ్నిశాపమున
వానరవనితయై వసుధఁ గేసరికి - మానిని యై యుండి మఱి యొక్కనాఁడు
వనగిరిస్థలులందు వర్తింపుచుండ - ననిలుఁ డాయంగన యలసయానంబు
తొడలబెడంగును దోరంపుబిరుదు నుడురాజబింబంబు నొరయునెమ్మోము
కలదు లే దను కౌను గబ్బిగుబ్బలును - దల చుట్టివచ్చు బిత్తరికన్నుఁగవయుఁ1180
గనుఁగొని మోహంబు గడలుకొనంగ - మనసిజశరభిన్నమానసుం డగుచుఁ
జెలరేఁగి కదియుచుఁ జెలువ మై డాసి - యాలింగనము సేయ నంజన యలిగి,
“నాదుపాతివ్రత్యనైపుణి చెఱుప - నేదుష్టమతి యొకో యిటు సమకట్టె?”
నా విని “యలుగ కో నాతి! నే వాయు - దేవుండ; నీదుపాతివ్రత్యమునకు
భంగంబు గాకుండ పరికించి హృదయ- సంగంబు నిలిపితి జలజాక్షి! దీనఁ
బలువేగవిక్రమపౌరుషశౌర్య - ములు గల తనయుఁ డిమ్ముల నీకుఁ బుట్టు;"