పుట:Ranganatha Ramayanamu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నతఁ డానతిచ్చినయట్లు మీతోడ - హితమతి నీకథ యెఱిఁగింపఁ గంటి
నివె పక్షములు వచ్చె నిదె చూడుఁ డనుచుఁ - దివిరి కుప్పించి యద్దివికి లంఘించి
వడి లంకచేరువ వనములో సీతఁ - బొడఁగాంచి "యదె సీతఁ బొడగంటి" ననుచు
"నదె! శతయోజనం బైనదూరమున - నదె లంకలోపల నదె! పుణ్యసాధ్వి
చాలుఁ బ్రాయోపదేశన మింక లెండు - పౌలస్త్యపతిలంకఁ బరికింపఁ బొండు”
అని లంక కటుఁ బోవ నటఁ ద్రోవఁ జూపి - చనియె హేమాద్రికి సంపాతి యపుడు1130
అంత వానరవీరు లందఱుఁ గూడి - సంతోషచిత్తులై జవ మొప్పఁ బోయి
చండవాతాఘాతజాతడిండీర - గండూషితాశావకాశనీకాశ
వీచీసమీచీనవిహరమాణాది - వైచిత్రకరవాలవరవాలములను
ఘోరనక్రగ్రాహకోటు లుప్పొంగఁ - బోరాడుచున్న యంభోరాశి డాసి
అందు నిశ్చేష్టితులై కొంతతడవు - గుందుడెందములతోఁ గూర్చుండి యపుడు
ఈసముద్రము దాఁట నెవ్వఁడు చాలు - నీసత్త్వ మెవరికి నిందులోఁ గలదు?"
అని యిట్లు చింతింప నంత నంగదుఁడు - వనచరుల్ తాను నవ్వనధితీరమున
నారాత్రి వేగించి యమ్మఱునాఁడు - వీరవానరుల వేర్వేఱ నీక్షించి
"ఈరీతి మీ రెంతలేసివానరులు - పౌరుషంబులు నేలపాలుగాఁ జేసి
జలరాశిలోపల శతయోజనములు - కొలఁది దాఁటుట కిట్లు గుందెద రేని ?1140
అపకీర్తి కెన యిది; యగణితాంభోధిఁ - గపివర్యులార! యేకరణి దాఁటెదరు?
మీమీజవంబులు మీదాఁటు కొలఁదు - లీమాత్ర మని పల్కు డెఱుఁగంగ నాకు

వానరవీరులు తమతమసత్త్వములఁ దెలుపుట

ఘనులార! యొక్కఁ డొక్కఁడు చెప్పుఁ" డనుచు - గినిసిన నందఱు గృతమతు లగుచుఁ
దమతమసత్త్వముల్ తగ విచారించి - అమితసత్త్వోన్నతు లందఱుఁ గూడి
“నలిమీఱి పదియోజనంబులు దాఁటఁ - గలవాఁడ నే" నని గజుఁ డందుఁ బలికె.
"ఇలమీఁద లావుమై నిరువది దాఁటి - సొలయ నే" నని గవాక్షుఁడు పేర్చి పలికె.
“మొనసిన కడిమిమై ముప్పది దాఁట - ఘనశక్తి గల" దని గవయుండు పలికె.
"నాలావుపెంపున నలువది దాఁటఁ - జాలుదు నే" నని శరభుండు పలికెఁ.
"బనిగొని జలధి యేఁబది బాఁటువాఁడ" నని గంధమాదనుం డలవుమైఁ బలికె.
“నస మెంత డింపక నరువది దాఁట - మసలక పో” దని మైందుండు పలికెఁ.1150
“దెగఁబడ కడిమిమై డెబ్బది దాఁటఁ - దెగువ కోపుదు" నని ద్వివిదుండు పలికె.
"నెనుబది దాఁటుదు నేపు దీపింప - దనియక నే" నని తారుండు పలికె.
మోపినతమలావు లొకఁడును దాప - కేపుమై నందఱు నిటు పల్కుచుండ
భల్లూకనాథుండు బహుకాలవృద్ధుఁ - డుల్లోకవిక్రముఁ డొకమాట పలికె.
"చిన్ననాటిబలంబు చెప్ప వచ్చినను - గ్రన్నన హాస్యకారణము; లిప్పటికి