పుట:Ranganatha Ramayanamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పగ దీర్చి శ్రీరామభద్రునిదేవి - మగఁటిమి దేనేర్తు; మాటల కేమి?"
నావిని భల్లూకనాథుఁ డిట్లనియె - నావాయుజుఁడు నంగదాదు లుప్పొంగ!
“నాజటాయువు తమ్ముఁ డట నీకు మొదల - నీజగంబులలోన నెదు రెందుఁ గలదు?
నీవు చూడనియట్టి నెలవులు లేవు - రావణుఁ డప్పుడు రఘురాముదేవి
నెందు దాచినవాఁడొ యెఱిఁగింపు" మనిన - సందేహ మెడబాయ సంపాతి పలికె.
“తనతనూభవుఁడు దుర్దమపరాక్రముఁడు - ఘనుఁడు సుపార్శ్వుండు కడుభక్తియుక్తి
ఱెక్కలు గాలి యీక్రియ నున్న నాకు - నక్కరతోఁ దెచ్చి యాహార మొసఁగు
నతఁ డొక్కనాఁడు నా కశనంబు దేక - దడసివచ్చిన “నేల తడసితి" వనిన1100
"నో తండ్రి నీకు నే నుపహార మరయ - నాతతగతి మహేంద్రాద్రిసముద్ర
తీరమార్గమున నెంతయుఁ బొంచియుండ - నారవిప్రభవంటి యంగనఁ గొంచు
గాటుకనడకొండ కైవడి నొకఁడు - ధాటియై చనుదెంచి తనకుఁ బ్రియంబుఁ
జెప్పి యేతెరు వియ్యఁ జెచ్చెరఁ జనియె - నప్పు డచ్చటిమౌను లందఱు నన్ను
సంతసింపుచు 'నేఁడు చావుకుఁ దప్పె - నంతకుం డగు రావణాసురుం డతఁడు
చెఱగొని లంకకు శ్రీరాముదేవి - నుఱకఁ గైగొనిపోవుచున్నవాఁ' డనిరి
అందుకై తడసితి” నని వాఁడు పలికె - సందేహ మేటికి? జనకతనూజ
బలసి రాక్షసవధూపరివృత యగుచు - జలదమాలికలోని చంద్రికఁ బోలి
యున్నది లంకలో నొగి శతయోజ - నోన్నతి నాదృష్టి యుర్విఁ జరించు.
తెల్లంబుగా మనోదృష్టియు నాకు - నెల్లపక్షులకంటే నెక్కుడై పరఁగు”1110
నని పల్కి మఱియు ని ట్లనియె సంపాతి - “తనపక్షయుగళంబు దగ్ధ మైనపుడు
ఏ వచ్చి మూర్ఛిల్లి యిచ్చోటఁ ద్రెళ్లి - చావునఁ దప్పి యెంచఁగ రాని దప్పి
కుట్టూర్పు లెసఁగంగఁ గొన్నేండ్లు గడపి - గట్టిగా నాభాగ్యగతి నొకనాఁడు
ఘననిష్ఠఁ దప మిందుఁ గావించు సకల - జనతాపహరుని సాక్షాన్నిశాకరుని
నానిశాకరుని నొయ్యనఁ గాంచి మ్రొక్కి - భానుదీప్తులచేత పక్షము ల్గాలి
తను వున్న చంద మంతయు విన్నవింప - మునిశిఖామణియును మున్ను న న్నెఱుఁగుఁ
గావున నెంతయుఁ గరుణించి మీఁదు - భావించి యా శ్రియఃపతి పరాత్పరుఁడు
విష్ణుండు దశరథవిభునకుఁ బుట్టి - యుష్ణాంశుకులుఁ డంత నుగ్రాటవులకుఁ
జనుదేర నాతనిసతిని రావణుఁడు - కొనిపోయి చెఱ నుంచుకొని యున్నయపుడు
అమృతాన్న మాయింతి కమృతాంశుఁ డిడిన - తెమలక యామహాతృష్ణలు పాసి1120
యుండు నంతట రాముఁ డొయ్యన వచ్చి - చండాంశజునిఁ గాంచి శక్రజుఁ ద్రుంచి
యాలోలగతి సీత నరయ వానరులు - నాలుగుదిశల కున్నతిఁ బంపఁగలఁడు
ఆరామునిజదూత లగు వారితోడ - జేరి నీ వీకథ చెప్పిననాఁడు
ఘనపక్షయుగళము గలుగుఁ బొమ్మనుచు - మును నిశాకరుఁ డను ముని చెప్పిపోయె.