పుట:Ranganatha Ramayanamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలనొప్ప వాలి భూవరుఁ డేయనేల? - బలిమితోడుతఁ గపిబలము రానేల?
యినతనూజుఁడు మమ్ము నిటు పంపనేల? - పనివడి మనకు నీపాటు రానేల?
ఊనినప్రాణంబు లురక పోనేల? - పోనేల యక్కటా! భువి కైకవరము
మనువంశయుతముగా మనవంశ మణఁచె" - నని యని శోకించి యలయుచున్నంత.

అంగదాదుల సంపాతి చూచుట

నాయెడ సంపాతియను పక్షినాథుఁ - డాయతదేహుఁ డత్యంతవృద్ధుండు
ప్రాయంటిఱెక్కలు బలిమియు లేమి - నాయద్రిగుహనుండి యల్లన వెడలి
మెల్లనఁ జనుదెంచి మృతి కోరి ధరణిఁ - ద్రెళ్లిన వనచరాధిపుల నీక్షించి
దైవంబు కృపచేసెఁ దనకు నాహార - మీవేళ నని చేర నేతేరఁ గపులు
చపలులై మరణనిశ్చయబుద్ధి వగవ - నపు డాంజనేయుతో నంగదుం డనియె!1070
“నిది పక్షి గాదు మ మ్మిందఱఁ జంప - సదయుఁడై యముఁ డిట్టు లరుదెంచినాఁడు
ఆజటాయువు నరనాథునిదేవిఁ - బోడిమి చెఱగొని పోవు రావణుని
దాఁక నాతనిఖడ్గధారచేఁ జచ్చి - తేకువఁ బడయఁడే దివ్యపదంబు?
రాముకార్యార్థమై ప్రాణము ల్మనము - నీమహాపక్షికి నిచ్చుట లెస్స”
యనుచోట నామాట లాలించి యరుణ - తనయుండు శోకగద్గదకంఠుఁ డగుచు
నాకపివీరుల నటఁ జేరఁ బోయి - "యోకపులార! యెందుండి వచ్చితిరి?
యాజటాయువు నాకు నర్మిలితమ్ముఁ - డాజటాయువు నేను నరుణపుత్రులము
నిశితోగ్రనఖుఁడు మానితమహామహుఁడు - దశరథుసఖుఁడు సంతతసత్యధనుఁడు
నతఁ డేమిటికిఁ జచ్చె?” ననవుడు వాలి - సుతుచేత నంతయుఁ జొప్పడఁ దెలిసి
యెంతయు శోకించి యిచ్చలోఁ జాల - వంత నొందుచునున్న వనచరు లెత్తి1080
చెంతనున్నపయోధిఁ జేర్చిన నందు - సంతాపమునఁ గృతస్నానుఁడై వచ్చి
విపులశోకముతోడ విహగవల్లభుఁడు - కపులతోఁ దనపూర్వకథఁ జెప్పఁదొడఁగె.
“ఆలోలగతుల జటాయువు నేను - గైలాసగిరియందుఁ గవగూడి యుండ
ఘనజవసత్త్వము ల్కడిమిమై మెఱసి - మొనసి మే మిద్దఱమును మత్సరించి
యుడువీథి కిద్దఱ ముదయకాలమునఁ - గడఁకతో నెగసి సంగడి పోయి పోయి
పరువడి నట పట్టపగలింటికొలఁది - కిరువురు దడసితి మినమండలంబు
ఉగ్రాంశుకిరణంబు లొండొండఁ దాఁకి - యుగ్రుఁడై యాజటాయువు మండుటయును
బదిలమై వాని నాపక్షంబులందుఁ - బొదివిన నాపక్షములు గాలిపోయె
నెఱకలు గాలిన నే పెల్లఁ బొలిసి - మఱి వచ్చి యీయాశ్రమంబునఁ బడితి
నాపక్షినాథుఁ డెం దరిగెనో? యెఱుఁగ - నీపల్కు మీచేత నిట వింటి నేను1090
వీనుల మీవార్త విని యున్నవాఁడ- హీనబలుండ నై యెఱకలు లేమి
పక్షముల్ తొల్లింటిపగిది నా కున్న - దక్షత నింతకుఁ దనసహోదరుని