పుట:Ranganatha Ramayanamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలువడి మన మిట్లు వెస వచ్చినట్టి - బిలములోపలఁ జొచ్చి పేర్మి నుండుదము
అది యష్టదిక్పాలకాభేద్యమార్గ - మది పక్వఫలభరితారామ మరయఁ
బొందుగా నచట గాపురమున్న మనల - నెందు నెవ్వరి కైన నెఱుఁగఁ జొప్పడదు"
అనఁ గొంద ఱగచరు లాపని కియ్య - కొని రంత మారుతి కోపించి పలికెఁ.
“బెద్దబుద్ధివి నీవు పినతండ్రి పనుప - గద్దరివై రాముకార్యమై వచ్చి
కపులతోఁ గూడి యాగంభీరబిలము - చపలతఁ జొచ్చి యచ్చట నుండినపుడె
భానుజుతో మళ్లఁ బడు నదిగాన - దాను నీలుండును తారుండు నలుఁడు
దీని కెవ్విధి సమ్మతింపము దక్క - వానరు ల్తమబంధువర్గంబుఁ బాసి
నినుఁ గొల్చియుండంగ నేరరు సుమ్ము - విను మదియునుగాక వృత్రారి తొల్లి
యర్మిలి తనవజ్రహతిని బిలంబు - నిర్మించె నటువంటి నిశితవజ్రాస్త్ర1040
కోటి లక్ష్మణునకుఁ గొలది నగ్గలము - మాటమాత్రమున నీమర్కటాధముల
నిన్ను నీబలమును నీఱుగాఁ జేయు - నున్న యీదుర్బుద్ధు లొక్కట విడిచి
యవనిజ పొడఁగాన మైతి మటంచు - రవిజునికడ కందఱము పోయి మ్రొక్కి
విన్నవింతము జగద్విఖ్యాతి నతఁడు - నిన్నును మమ్ము మన్నించు మోమోపి
యామీఁద మీతల్లి కనురక్తుఁ డగుట - నీమీఁద నలుగఁడు నీవు పుత్రుఁడవు
కావునఁ గడు నిన్నుఁ గట్టుపట్టంబు" - నా విని యావాలినందనుం డనియెఁ;
“బితృసమానుని వాలిఁ బృథ్విపైఁ గూల్చి - యతనిభార్య వరించి యామీఁదఁ దనకు
నుపకారి యగు రాము కుద్యోగ మెల్లఁ - జపలుఁడై మఱచి లక్ష్మణుఁ డాగ్రహింప
మఱి గాదె చనుదెంచె మాపినతండ్రి - యెఱుఁగవే యాతనిహీనవర్తనము?
అట్టి కామాంధుని నట్టి కృతఘ్ను - నెట్టు నమ్మఁగవచ్చు నిది యది యేల?1050

కపులు ప్రాయోపవేశము చేయుట

శ్రీరాముకార్యంబు సేయక పోయి - యారవిసూనుచే నటు చచ్చుకంటె
నీయెడఁ జచ్చుట యిది లెస్స మనకుఁ - బ్రాయోపవేశనపరులు గం" డనుచు
వారును దానును వరదర్భశయను - లై రాక వృథా యని యాత్మఁ జింతించి
తెవులును ముదిమియుఁ దీవ్రవేదనయు - నవతయు లేని ప్రాణంబులు గావ
లేచియు మఱి పవ్వళించియు దిశలు - చూచియుఁ దమతమచుట్టాల సతులఁ
దలఁచియు బాపురే! దైవమా యిట్లు - చలపట్టి మము వృథా చంప నిచ్చోట
సమకట్టితే! యంచు సకలవానరులు - గుమురులు గుమురులై కూడి యొండొరులు
“నలినాప్తకులుఁడు కానలకు రానేల? - కులభామ నసురచేఁ గోల్పడనేల?
యెరసి దైత్యుఁడు జటాయువుఁ జంపనేల? - ధరణీశుఁ డరుణనందనుఁ గననేల?
ధరణిజవార్త యాతఁడు చెప్పనేల? - తరణివంశులు పంప దరికి రానేల?1060
సుగ్రీవుకడకు రాసుతులు రానేల? - సుగ్రీవుఁ డాతనిసొమ్ము గానేల?