పుట:Ranganatha Ramayanamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నొకపుణ్యకాంత నయ్యువిదకు మ్రొక్కి - యకలంకచిత్తుఁడై హనుమంతుఁ డనియె,1000
“ఓతన్వి! నీ వెవ్వ రొంటిమై నిచట - నీతపం బొనరింప నేమి కారణము?
ఏమహాత్మునిపురి యీహేమనగర? మే మెన్నఁడును గాన మిట్టిచిత్రములు"
అనిన నక్కోమలి హనుమంతుఁ జూచి - తనపూర్వకథ లెల్లఁ దాఁ జెప్పఁదొడఁగెఁ.
“దగఁ దొల్లి మయుఁ డను దానవేశ్వరుఁడు - తగిలి పద్మజుఁ గూర్చి తప మాచరించి
పస నొప్పు నిర్మాణపటుశక్తి వడసి - పసిఁడిగోపుర మిట్లు పరఁగ నిర్మించె
నవిరళగతి హేమ యను దివ్యవనిత - గవిసి యాతఁడు పెద్దకాల మిం దుండ
నాతని వజ్రధారాహతుఁ జేసి - యాతన్విఁ గొనిపోయె నమరవల్లభుఁడు
ఆతరలాక్షి నెయ్యపుఁజెలికత్తె - మాతండ్రి సావర్ణి యహితమానసుఁడు
నాయింతిపనుపున నతితపోనిష్ఠఁ - బాయకుండుదు స్వయంప్రభ యనుదాన”
నని చెప్పి కందమూలాదు లందఱికిఁ - దనివిదీర నొసంగి తాపంబు దీర్చి1010
“యనఘ! మీ రెవ్వ రిం దరుగుదేనేల - యనిమిషు లైన నిం దరుగుదేరాదు
వినుఁ డిందు మీర లెవ్విధిని వచ్చితిరి?"- యన విని హనుమంతుఁ డతివ కి ట్లనియెఁ.
“దనతండ్రిపనుపున దండకాటవికి - మునివృత్తి రాముఁ డిమ్ముల వచ్చియుండ
వనజాక్షి నారామువరపత్నిఁ గొనుచుఁ - జనిన రావణువెంటఁ జనిచని యేము
జనకజ వెదకుచు జలశూన్యమైన - ఘనమైన దప్పిచేఁ గడు డస్సి యొక్క
బిలములోపలఁ జొచ్చి పెద్దచీఁకటికిఁ - దలఁకక యొక్కట దైవయత్నమున
నీయాశ్రమంబున కేతెంచి వెడలి - పోయెడుమార్గంబు పొడగానలేక
తిరుగుచున్నార ముద్ధతిఁ బెక్కుదినము - లురిఁ బడియున్నార మొకదిక్కు లేక"
యనిన రామునికార్యమై వచ్చినారు - అనఘులు పుణ్యాత్ము లని భక్తిఁ జేసి
"మీ కెద్ది యిష్ట మిమ్మెయి వేఁడుఁ" డనిన - మా కీబిలద్వారమార్గంబు వెడలఁ1020
జేయుము వేవేగ సీతను వెదకఁ - బోయెద" మనుడు నుప్పొంగి యామగువ
మొగి మీరు కన్నులు మూసికొం డనుచుఁ - దగఁ బుచ్చి వారలఁ దనతపశ్శక్తి
నెలతుఁక యవలీల నిమిషమాత్రమున - బిలముఖమునఁ దెచ్చి పెట్టి తాఁ బోయె,
బోయిన కపివీరపుంగవులెల్ల - నాయింతి పొగడుచు నటఁ బోయి పోయి
యాయతోన్నతబలు లం దొక్కసరసిఁ - బాయక జలములు బలువిడిఁ ద్రావి

కపులు చింతాక్రాంతు లగుట

యంత నందఱు మహేంద్రాద్రికిఁ బోవ - నంత నంగదుఁడు ని ట్లనుచు శోకించె;
“ఇనజుని మితి దప్పె నినవంశుదేవి - వనజాక్షిఁ బొడగన్నవారము గాము
ఆజ్ఞాధురంధరుఁ డైన సుగ్రీవుఁ - డాజ్ఞ దప్పిరి వీర లంచును మనలఁ
బొడగన్నయప్పుడే భూపతి మెచ్చ - నడిమికి రెండుగా నఱికించు మనలఁ
గావున మన మింకఁ గపిరాజుఁ గానఁ బోవుట తగవును బుద్ధియుఁ గాదు1030