పుట:Ranganatha Ramayanamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నదులందు గిరులందు నగరంబులందు - వెదకి జానకిఁ గాన వెరవు లే కునికి
చింతాసమాక్రాంతచిత్తులై పోయి - యంతంత గుమురులై యటఁ బోయి పోయి

అంగదాదులు గుహఁ జొచ్చుట

పదియేండ్ల తనకూర్మిపట్టి యచ్చోటఁ - గదలి జలములఁ బడి కాలునిపురికి
బోయినఁ బొగలుచుఁ బుత్రశోకాగ్నిఁ - బాయక పడి కాలి పలవించుచున్న
కణ్వమహామునిఘనశాపవహ్ని - మండి నిర్మృగము నిర్మానుష్య మగుచు
నుండ నీడయుఁ ద్రావ నుదకంబు లేక - పండక బహుశూన్యపథమైన యడవి
చొచ్చి యెంతేనియు సొలసి లోదారి - నచ్చోటనుదకంబు నరయుచున్నంత
నందొక్క రక్కసుం డగచరాధిపుల - ముందఱ నీలాభ్రమో యన నిలిచి
"యోరి వానరులార! యుర్విపై నేను - మారీచతనయుండ మహితవిక్రముఁడ
దేవగంధర్వులు తివిరి యే నున్న - యీవని దృష్టింప నెవ్వరు వెఱతు980
రిం దేల వచ్చితి? రిందఱుఁ గూడి - యెందుఁ బోవఁగ వచ్చు నింక నాచేతఁ
జావక మీ” కంచు సంరంభ మెసఁగ - కో యని యార్చినఁ గుపితుఁడై యపుడు
అంగదుం డాదైత్యు నదరంట వ్రేయ - పొంగి రక్తము వాత బొడబొడ వెడలి
వసుధపైఁ బడె నంత వానరు లెల్లఁ - బొసఁగంగ నొకమహాభూజంబునీడ
నలసి కూర్చుండి తోయంబు లెచ్చోట - గలవొకో? యని దప్పి గదుర నున్నంత
దరిమిడి యొకబిలద్వారంబు వెడలి - యురువడి జలపక్షు లొండొండ నెగయఁ
గనుఁగొని యుదక మిక్కడ నుండఁ బోలు - నని వచ్చి బిలములో నందఱు డిగఁగఁ
గలగొని విపులాంధకారమై తెరువు - తెలియ కొండరులను ధృతిఁ జీరికొనుచు
ననుపమసత్త్వులై యటఁ బోవఁ బోవఁ - గనుఁగొని యయ్యంధకారంబు విరిసి
యరుదుగా జగదద్భుతాకార మైన - పుర మొక్కఁ డచ్చోటఁ బొడ గాంచి వచ్చి990
పసిఁడిగోపురములు పసిఁడిమేడలును - పసిఁడియట్టళ్లును పసిఁడికోటలును
పసిఁడివృక్షంబులు పసిఁడిపూపొదలు - పసిఁడి పర్వతములు పసిఁడితామరలు
నై చూడ నాపురం బతిరమ్యమైనఁ - జూచి యెంతేనియుఁ జోద్యంబు నొంది
ప్రకటసంపదలచేఁ బరఁగుచుండియును - నకట నిర్మానుష్య మైనది పురము
ఏలొకో యీపురం బిట్లయ్యె ననుచు - నీలీల వెడలు చొ ప్పెఱుఁగంగ లేక
చాలఁ జింతిలుచు నచ్చటఁ గొన్నినాళ్లు - పోలఁ జరింపుచు పురమధ్యవీథి
మిన్నులతో రాయు మేదినియందు - నున్నతం బగుచున్న యొక మేడఁ గాంచి

కపులు స్వయంప్రభను గాంచుట

కని దానిమీఁదికిఁ గపు లెల్లఁ బ్రాకి - కనిరి తపోవృత్తి కర మొప్పు గాంచి
హరిణాజినాంబరయై యొప్పుదానిఁ - దరుణేందుకళఁ బోలి తనరారుదాని