పుట:Ranganatha Ramayanamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అర్కహీనము నమర్యాదంబు గానఁ - బేర్కొన నవ్వలిపృథివి యే నెఱుఁగ.”
ననిన సుషేణాదులగు మహాకపులు - పనిఁ బూని పోయిరి పడమటిదిశకు.940
జలజాప్తసుతుఁ డంత శతబలిఁ బిలిచి - "నలి నీవు లక్షవానరులతోఁ గూడ
మొదటఁ బుళిందభూములు సొచ్చి - పోయి చెదరక యాసౌరసేనంబు వెదకి
భరతభూముల నెల్ల పరికించి యవన - ధరణీశుదేశంబు తడయక వెదకి
కడగి కాంభోజకొంకణభూము లరసి - యెడపక యటఁ బోయి హిమవంత మరసి
సోమాశ్రమంబునఁ జొచ్చి శోధించి - శ్రీమించు కాళాఖ్యశిఖరి నీక్షించి
యామై సుదర్శనమను నద్రి వెదకి - కామించి యటఁ బోయి కనకాద్రి వెదకి
కైలాసగిరియును గౌబేరవనము - నాలోలనయన మీ రలయక వెదకి
ధనదునిపురము నాతనిసరోవరము - ననుమోదభరము పాయక విలోకించి
యందుఁ గుబేరుని నడిగి క్రౌంచాద్రి - యందు మీ రందఱు నవనిజ వెదకి
చని యట మైనాకశైలంబు గడచి - యనఘ! వైఖానసం బను కొల నరసి950
తనరు శైలోదాఖ్యతటిని లంఘించి - గొనకొని యుత్తరుకురుభూము లరసి
యచ్చట గంధర్వు లప్సరల్ సురలు - నిచ్చలు నుందు రానెలవులు వెదకి
నిలువ కుత్తరపయోనిధి దాఁటి పోయి - సొలయక యటమీఁద సోమాద్రి వెదకి
యచట బ్రహ్మయు శివుఁ డర్థి వర్తింతు - రచలితగతి మీర లందుండి మరలి
యొకనెలలోపల నుర్వీశుకడకు - బ్రకటంబుగా మీరు ప్రతివార్త దెండు"
అనవుడు శతబలి యవనీశు వీడు - కొని యుత్తరంబు దిక్కున కేగె నంత.
అప్పుడు రఘురాముఁ డర్కజుఁ జూచి - “యెప్పుడు చూచినా వీభూము లెల్ల”
నా విని “వాలికి నాఁ డేను వెఱచి - వేవేగ యతఁడు నావెనువెంటఁ దగులఁ
గలగొన గుఱుతులుగా మహి యెల్ల - నలుదిక్కులును చూచినాఁడ నే" ననియె.
ననిన నచ్చెరువంది యటఁ గొంతకాల - మినజానుజులు గొల్వ నినకులుఁ డుండె.960
దగఁ బూర్వపశ్చిమోత్తరములు చూడ - జగతీశుపనుపునఁ జనిన వానరులు
నినరశ్ము లెందాఁక నిలమీఁదఁ బర్వు - ననుపమసత్త్వులై యందాఁకఁ దిరిగి
నలినాక్షి నెందుఁ గానక వచ్చి పతికిఁ - జెలు వేది ప్రతివార్త చెప్పి రందఱును.
అట రామసుగ్రీవు లంగదముఖ్యు - లిటమీఁదఁ బ్రతివార్త లేమి చెప్పెదరొ?
యది యేమి చందమో యని వారి రాక - కెదురుచూచుచునుండి రెంతయు వగచి
అంత నంగదముఖ్యు లగు మహాకపులు - పంతంబు లాడుచుఁ బరమహర్షమున
సంతతజవసత్త్వసంపద ల్మెఱసి - మంతు కెక్కిన హనుమంతుండుఁ దాము
చెదరక రవిజుండు చెప్పినయట్ల - మొదలు వింధ్యాచలంబున కేగుదెంచి
యందలిగుహల మహాగహనముల - నందంద వైదేహి నరయుచుఁ గదలి
యది యాదిగా దక్షిణంబున కరిగి - పొదలఁ బూపొదలందు భూజంబులందు970