పుట:Ranganatha Ramayanamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"మీ రింక నాయాజ్ఞ మీఱక పోయి - శ్రీరమ్యముగను కిష్కింధఁ గైసేసి
స్థిరమైన కపిరాజ్యసింహాసనమునఁ - పరఁగ సుగ్రీవునిఁ బట్టంబుఁ గట్టి
యొందంగ నంగదు యువరాజ్యపదము - నందఁ బట్టము గట్టుఁ" డని యొప్పఁ బలుకఁ
దడయక వానరదండనాయకులు - కడుఁ గూడి కిష్కింధ కప్పు డేతెంచి
నూత్నశృంగారమనోహరాగార - రత్నవితర్దికారమణీయహార660
రంగవల్లీహారరంజితద్వార - రంగధ్వజోదారరమ్యపటీర
నీరపూరితమార్గనిరుపమాకార - పౌరసంచారసంభరితంబు గాఁగఁ
జెలఁగి యాపురము గైసేయించి - నగరు కొలువుకూటంబు మిక్కుట మైన సిరికిఁ
గారణంబుగ నలంకారం బొనర్చి - వారిధినదనదీవారియు మఱియుఁ
దగుమంగళద్రవ్యతతులుఁ దెప్పించి? - మొగి నిండ శుభతూర్యములు మ్రోయుచుండఁ
బుణ్యాంగనామణు ల్పొలుపొందఁ జాలఁ - బుణ్యాహవాచనపూర్వకంబుగను
సింహచర్మంబునఁ జిహ్నితంబైన - సింహపీఠిని గపిసింహంబు నునిచి
సురపతిఁ బోలె భాసురలీలఁ బ్లవగ - వరు లభిషేకపూర్వంబుగాఁ గదిసి
లలితపుణ్యోదయలగ్నంబునందు - బలియు సుగ్రీవునిఁ బట్టంబు గట్టి
యురుసత్త్వు నంగదు యువరాజ్యమునకుఁ - గరమొప్పఁ బట్టంబు గట్టిరి ప్రీతి670
నంగదు యువరాజ్యమందును నిలుపఁ - బొంగె వేడుక లంతిపురవరంబునను
అల నీలతారాంజనాతనూభవులు - కలబంధువులు పొడగనిరి సుగ్రీవు
నితరవానరనాథు లెల్లఁ గేల్మొగిచి - రతిమోదమునఁ గొనియాడిరి ప్రీతి,
అంత సుగ్రీవుఁ డుదాత్తసంపదల - నెంతయుఁ బెంపొంది యింపు సొంపొంది
వనచరబలముతో వడి నేగుదెంచి - ఘనరత్నకోటులు కానుక లిచ్చి
యాదటఁ బెంపొంది యారామచంద్రు - పాదపద్మములకు భక్తితో మ్రొక్కి
కరములు ముకుళించి కడుఁబ్రేమ నిలిచి - పరమసమ్మదమున భానునందనుఁడు
"ఇచ్చోట నేటికి నింక నాపురికి - విచ్చేయుదురు గాక! విశ్వలోకేశ!"
యనవుడు సుగ్రీవు నాననాంబుజము - కనుఁగొని ప్రీతి రాఘవుఁ డిట్టు లనియెఁ.
“దపసులు పురమునఁ దగదు వర్తింపఁ - దపనజ! కిష్కింధ తగదు; మా కింక680
మహిమీఁద నాషాఢమాసంబు వచ్చె; - నహితులపైఁ బోవ ననువుగా దింక
వానకాలము మాల్యవంతంబునందు - నే నుండఁగలవాఁడ నెబ్భంగి నైన
ఇనతనూభవ! నీవు నీవానకాల - మొనరఁ గిష్కింధలో నుండుము పోయి
తలకొని మఱి శరత్కాలంబునందుఁ - బొలుపొందఁ బగరపైఁ బోదము కడఁగి"
యని చెప్పి మన్నించి యతని వీడ్కొలిపి - యనుజన్ముఁడును దాను నచ్చోటుఁ బాసి

శ్రీరాములు మాల్యవంతముఁ జేరుట

వసుధేశుఁ డమ్మాల్యవంతంబునందు - గుసుమకోమలి సీతగుణము పాయంబు