పుట:Ranganatha Ramayanamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామాంధుఁ డెందైనఁ గలఁడె? నీవంటి - పామరుఁ డొకఁడు దప్ప జగత్త్రయమున
నది యటులుండని మ్మతఁడును నేను - గదిసి సఖ్యము సేయుకతమున నీవు
జగతిపై నామిత్రశత్రుండ వగుటఁ - దెగి నాకు నిన్ను వధించుట తగవు.
అకలంకులై వేఁట లాడెడివారు - నొకటి దీమము నొడ్డి యొకటి సేయుదురు,
ఉరుశక్తి మాటున నుండి వేయుదురు - పరికింప దీనఁ బాపము లేదు నాకుఁ
గావున శాఖామృగం బగునిన్ను - నేవిధిఁ జంపిన నెగ్గేల కలుగు?
చతురబాహాశక్తి జగతి నంతటికిఁ - బతియైన భరతుని పంపున వచ్చి
దుష్టమృగంబుల దుష్టరాక్షసుల - సృష్టిపై మేము శిక్షించుచుండుదుము
నీతమ్ముఁ డగువాని నెలఁతఁ గైకొన్న - పాతకుఁడవు గానఁ బట్టి చంపితిని
రాజదండితుఁడు నారకబాధఁ బొరయఁ - డోజమై గాన నాయుగ్రాస్త్రనిహతి
మనికితపడక నిర్మలుఁడవై యింక - ననిమిషరాజ్యసౌఖ్యముఁ బొందు మీవు"540
అని యొప్ప రఘురాముఁ డాడువాక్యములు - విని వాలి కనుమూసి వివశుఁడై యుండి
కొంతసేపునకుఁ బేర్కొని రామచంద్రు - నెంతయుఁ గనుఁగొని యిట్లని పలికె.
"ఓరామ! గుణధామ! యుగ్రాంపధామ - తారాధిపానన! తార నాదేవి
దేవరశౌర్యంబు దెలిపి నేఁ డనికిఁ - బోవల దన్న దుర్బుద్ధి పాటించి
విధివిహితంబున వెనకనే వెడలి - యధికజన్యమున ని ట్లవనిపైఁ బడితిఁ
బడినకోపమున దుర్భాషలు కొన్ని - జడిమి పల్కితి నింక సైరింపవయ్య!
తనపాటు చింతింపఁ దారకు వగవఁ - దనయు నంగదునకై తలఁకెద నధిప!
నింత కే మగుదురో యింతియు సుతుఁడు - ఇంతటిదురవస్థ యే వచ్చు టెఱుఁగ;”
నని శోకమోహంబు లనుపయోరాశి - మునిఁగి మూర్చిలియుండె మూగచందమున,
అంతఃపురంబున కావార్త పోవ - నంతలోఁ దారాదు లైన కామినులు550
వాలి గూలినమాట వజ్రమై తమదు - వాలుగుండెలు నాట వసుధపైఁ గూలి
యంతలోఁ దెలియుచు హా! యని వారు - నంతలోఁ దారుచు నచట సోలుచును
హాయంగదా నేఁడు నావాలి దివికిఁ - బోయెఁగదా యంచుఁ బొగులంగఁ గ్రుంగ
నంగదుఁ దోడ్కొని యతులశోకమునఁ - బొంగియుఁ బొంగి యేడ్పులు నింగి ముట్ట
వేవేగ కిష్కింధ వెడలి రా నడుమఁ - ద్రోవ వారల నెదుర్కొని కపు లనిరి.
“వాలి రాఘవుచేత వసుధపైఁ గూలె - నేల పోయెదరు పోయినఁ బ్రమాదంబు
రాక మానదు సుమీ! రామసుగ్రీవు - లేకమై యుంట మీ రెఱుఁగరే మొదల?
నీయంగదునిఁ బట్టి యేమి సేయుదురొ? - దాయలమది నమ్మఁ దగ దటుకాన

తార ప్రలాపించుట

నితనిచేఁ గపిరాజ్య మేలింత మింక - మతిమంతు లగు కపు ల్మనకు నున్నారు
పోవల" దన్న నప్పుడు తార తగవు - భావించి వెస వారి పలుమాఱు దూరి560