పుట:Ranganatha Ramayanamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావ్యము

కిష్కింధాకాండము

205


మొదలైనషడ్గుణంబులరాశి యగుచు - పొదవిన నీపెంపు పొల్లుగాఁ జేసి
యెనసి సుగ్రీవుతో నేను బోరాడ - నను నేయనగు నయ్య! నడుఁ జొచ్చి నీవు
ఏను నీకపకార మెన్నఁడు సేయ - నేను నీకును దోష మిచ్చఁ జింతింప500
నీకు శత్రుఁడఁ గాను నీశత్రుఁ గూడ - నీకు శత్రులు లేరు నికృతు లే నెఱుఁగ
నెఱిఁగి యుపేక్షింప నిటు సేయఁదగునె? - నెఱిఁగియు నెఱుఁగవై తినవంశతిలక!
శరభకంఠీరవశార్దూలకోల - కరిహరిణాదుల ఖండింపఁ గోరి
వసుధ రాజులు వేఁట వత్తురుకాక - యెసఁగఁ గోతులఁ బట్టి యెందుఁ జంపుదురు?
అర్కసూనుఁడు మేము నన్నదమ్ములము - కర్కశమతిఁ బూని గారవం బెడలి
యడర మే మెట్లైన నైతిమి కాక - కడఁగి నీ విటు చంపఁ గారణం బేమి?
కుందేలు నుడుమును గూర్మంబు నేఁదుఁ - బంది సాలువయును భక్ష్యముల్ గాని,
వంచనఁ జంపి యీప్లవగంబుఁ దినరు - పొంచి న న్ని ట్లేసి పొలియించి తేల
మనుజేశ! యింక నామాంసరక్తంబు - లనుభవింపుము నీవు ననుజుండుఁ గూడి,
విశదకీర్తుల జగద్విఖ్యాతుఁ డైన - దశరథుపనుపున ధర్మంబు పూని510
వనములఁ దపసివై వర్తింపవచ్చి - జననాథ! జీవహింసకు రోయవైతి
ధరణిపై మే మొకతప్పు చేసినను - భరతుండు తగుఁ గాక పట్టి శిక్షింప
నీకుఁ గారణ మేమి? నీవు భూపతివె? - చేకొని యిట్లేల చేసితి నన్ను?
నీదేవిఁ గొని చన్న నీచరావణుని - నాదట సాధింతు నని యేగుదెంచి,
నను డించి నీ వర్కనందనుఁ బట్టి - తనయంబు నీతి బేలైతి లోకముల
నీవార్త నీవు నా కెఱిఁగించితేని - దేవ! నీదేవి సాధింపనే యేను
నాతతబలశాలి యై యేగుదెంచి - సీతామహాదేవి చెఱఁగొని చనిన
వానిని మున్ను నావాలరోమములఁ - బూని బంధించి యంబుధు లెల్ల ముంచి
కరుణించి విడిచిన ఘనబాహుశక్తి - సొరిది లోకములను సుగ్రీవుఁ డెఱుఁగుఁ
బెలుకుర నన్నుఁ జంపెడివాఁడ వకట - బలిమిమైఁ నాదృష్టి పథమున నిల్చి520
ననుఁ బేరుకొని పిల్చి నను మందలించి - జననాథ! కడిమిమైఁ జంపలే వైతి!
చలము గైకొని డాగి జంపితి నన్ను - దలపోయ నిది రాజధర్మంబె?" యనిన
వాలిమాటలు విని వసుధేశుఁ డనియె - "వాలి! యీమాటలు వలవదు నీకుఁ
గపివంశమునఁ బుట్టి కపులతోఁ బెరిఁగి - చపలుఁడవై ధర్మశాస్త్రంబుతెఱఁగు
తెలియక నీవు నాదెసఁ దప్పుమోపి - పలికెద విది ధర్మపద్ధతి గాదు
నీ వన్నపలుకు లన్నిటికి యుక్తముగ - నావాక్యములు కొన్ని నయబుద్ధి వినుము.
అనుజునిఁ దనుజన్ము న ట్లగ్రజుండు - పనుపంగవలె నండ్రు మహి ధర్మవిదులు
ఆమేర దప్పి నీ వపరాధహీనుఁ - దామరసాప్తనందనుఁ బురి వెడల
నడఁచి వావిని గోడ లై యొప్పునతని - పడఁతిని రతిఁ బట్టి బల్మి భోగించు