పుట:Ranganatha Ramayanamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధీరుఁడై శూరుఁడై దివిజు లుప్పొంగ - నారవిజుని వైచె నడరి శైలమున
నదరక సుగ్రీవుఁ డడఁచె వాలమునఁ - బదములు నొప్పించె బలియుఁడై వాలి
కరనఖంబుల వ్రచ్చెఁ గడఁగి సుగ్రీవుఁ - డురుముష్టి నొప్పించె నుగ్రుఁడై వాలి
యంతటఁ దనియక నార్పులు నిగుడ - నంతకంతకు లావు లడరి యిద్దఱును470
ఘనపదాపది కచాకచి నఖానఖిని - చెనసి ముషాముష్టి చెలఁగి పోరుచును
హు మ్మని మ్రోయుచు నూర్పు లొండొండ - గ్రమ్మ సంగముల రక్తంబు లుబ్బుచును
వాలము ల్బాహులు వరుస నొండొండఁ - గీలించి పెనఁగుచుఁ గినిసి తాఁకుచును
బాయుచు డాయుచు బలిమి నొండొరుల - వ్రేయుచు ద్రోయుచు విపులసత్త్వముల
దూటుచు దాఁటుచుఁ దోడ్తోనఁ బగలు - చాటుచు మీటుచు సాంద్రమర్మముల
నిరువురు కడిమిమై నిబ్భంగిఁ బోర - సురలోకనాయకసుతునకు లోగి
తరణితనూజుఁ డత్తఱిఁ జాల నొచ్చి - గరువంబు దక్కి సంగరభూమిఁ జిక్కి
పెదవులు దడపుచుఁ బెంపెల్లఁ బొలిసి - కుదిసి భీతిల్లి దిక్కులు చూచుచుండె.
నిగ్రహానుగ్రహనిధి రాముఁ డంత - సుగ్రీవుఁ డలపడ స్రుక్కుటఁ జూచి

అమోఘాస్త్రముచే వాలి గూలుట

యీలోననే వాలి నే నేయకున్న - వాలి సుగ్రీవుని వధియించు ననుచు480
జలనిధు లేడును జగము లీరేడు - కలఁగి భూతల మెల్లఁ గడఁగి కంపింప
గుణనాద మొనరించి కోరి మైఁ బెంచి - తృణముగా దృష్టించి తెగఁదీసి పోసి
వెస నమోఘాస్త్రంబు వింట సంధించి - యసమానబలశాలి యగు వాలి నేసె
నేయుడు నబ్బాణ మినవహ్నిరుచుల - మాయించి వడి నభోమండలి నిండి
యురుతరానలకీల లొలుక నొండొండ- గరుడోరగామరగంధర్వు లదరఁ
దనపుత్త్రు రక్షింప దాయ శిక్షింప - నినుఁ డిట్టియస్త్రమై యేతెంచె ననఁగఁ
దపనపుత్రుఁడు గాన దండధరుండు - కృపఁ దమ్మ్ముఁడైన సుగ్రీవునిఁ బ్రోవఁ
దనకేలదండ ముద్ధతి వాలిమీఁదఁ - బనిచెనో యన మహాపవనవేగమున
నురవడి జనుదెంచి యురమున నాటఁ - దరుచరపతి గూలె దర్పంబు దూలి
కెరలి దిక్కరులతో గిరులతోఁ బెలుచఁ - దరులతో నందంద ధరణి కంపింప490
నురము గాడినబాణ ముఱువడి వెడలి - ధరఁ గాడె నత్తఱిఁ దరుచరేశ్వరుఁడు
నవిరళరక్తసిక్తాంగుఁడై వాలి - యవనిఁ ద్రెళ్ళిన పుష్పితాశోక మనఁగఁ
·బ్రళయకాలంబునఁ బ్రభ లెల్ల మాని - యిలమీఁద వ్రాలిన యినునిచందమున
నవశుఁడై యవనిపై నమ్ముతో నుండ - నవనీశుఁ డగు రాముఁ డటఁ జేర వచ్చె.
వచ్చిన రఘురాము వాలి వీక్షించి - యిచ్చలోపలికోప మెసఁగ నిట్లనియె.
“నోరాఘవేశ్వర! యోరామచంద్ర! - ధారుణిపై నిన్ను ధర్మాత్ముఁ డండ్రు.
దమమును శమమును దయయు సత్యంబు - సమబుద్ధి నీతియు సౌమనస్యంబు