పుట:Ranganatha Ramayanamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రేళ్లురికియుఁ బిడికిటఁ దోఁకఁ బట్టి - యెల్లెడఁ గుదియించి యెడపక త్రిప్పి
వడి దూలి యసురయు వాపోవ వైవఁ - గడఁగి మర్మముఁ గాంచి కడువడిఁ బొడిచి310
బలిమిఁ గొమ్ములు పట్టి పడవైచి చంపి - తలకొన్న లావుమై తన్నెఁ దన్నుటయు
ముక్కునఁ జెవుల మోమున నెత్తురొలుక - నక్కులిశాహతి నద్రియవోలె
నాయుగ్రదైత్యుమహాకళేబరము - పోయి యోజనమాత్రమునఁ దూలిపడియె.
గైరికనిర్ఘ రాకారంబు లగుచు - నారక్తకణము లయ్యద్రిపైఁ బడిన
నారసి యిచట నిత్యము తపంబున్న - దారుణశక్తి మతంగుఁడు గినిసి
యీపర్వతము వాలి కెక్కరాకుండ - శాపంబు గావించె జగదేకనాథ!
కాన నీఋశ్యమూకమునందు వెఱవ - కేను గాపుండుదు నెల్లకాలంబు
కడగి యీదుందుభికాయంబుఁ బుచ్చి - పుడమిపై యోజనంబును బాఱవైవ
వలనైన భుజశక్తి వాలికిఁగాని - తలపోయ నొరులకుఁ దరముగా దధిప!
గైకొని నీవంతకంటె దూరముగ - నీకళేబర మిప్పు డిట మీటకున్న320
నెనసిన మీసత్త్వ మిచ్చ నేనమ్మ" - ననవుడు రఘురాముఁ డల్లన నవ్వి
"యాదుందుభిశరీర మవలీల మీటి - నీదుసందేహంబు నేఁడు వాపెదను
ఇనతనూభవ! దాని నేర్పడఁ జూపు" - మనవుడు సుగ్రీవుఁ డర్థితోఁ జూప
ఘనమేరుమందరాకారమైయున్నఁ - గని కళేబరము దగ్గరకు నేతెంచి
గొనకొని దానిఁ గైకొనక నంగుష్ఠ - మునఁ బదియోజనంబులు మీటి వైచె;
వైచిన రఘురామువరశక్తిపేర్మిఁ - జూచియు నమ్మక సుగ్రీవుఁ డనియె,
"నెలమిమై నిది వాలి మీటెడునాఁడు - దల మైనరక్తమాంసములతో నుండు
మనుజేశ! నేఁ డస్థిమాత్ర మై యుండుఁ - గని నీవు మీటితి గాక యొక్కింత
వడిఁ బేర నీలావు వాలిలావునకుఁ - గడునెక్కు డని నమ్మఁగారాదు దేవ
యతఁ డిదియునుగాక యలవొప్ప మీటు - క్షితిధరంబులు పుట్టచెండులమాడ్కి330
జతురంబునిధులందు సంధ్యలు వార్చి - శితికంఠుపదముల శిరమర్థిఁ జేర్చు
వాయువుకన్న జవంబు హెచ్చుగను - దోయధులన్ని దోడ్తో దాఁటివచ్చు
వాలికి నిర్జరేశ్వర! దంతిహేమ - మాలి కెవ్వరుసాటి మఱి యొండు వినుము
ధరణీశ! యియ్యేడు తాళ్ళును దొల్లి - వరశక్తియుక్తిమై వాలి బిట్టెగసి
కరముల నొక్కటిగాఁ గూడఁ బట్టి - తరమిడి వానిపత్రములెల్లఁ ద్రుంచు
నడరి తాళంబుల నం దొక్కటైన - వడిఁ గదల్పఁగ లేరు వాసవాదులును
దలకొని యొకకోల తాళంబు లేడు - నిలువక గాఁడిపో సేసితి వేని
వసుధేశ! నీలావు వాలిలావునకు- నసమానగతి కెక్కు డని నమ్మవచ్చు
ధరణీశ! యీసప్తతాళంబు లొక్క - శరమునఁ దెగవేయు శౌర్యంబు గలుగు
పురుషునిచే వాలి పొలియు నటంచు - నరయ నాకు మరుత్తుఁ డనుముని చెప్పె."340