పుట:Ranganatha Ramayanamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నని యిట్లు కొనియాడు నవనీశుఁ జూచి - తనమేను పులకించి తడయక వచ్చి
యురుమతి సీత శిరోరత్న మెలమి - గురుతుగాఁ దెచ్చి గ్రక్కున నిత్తు నన్న90
కరణి నాఫలము రాఘవమహీపతికి - గరిమెతో కానుకగా సమర్పించి
"నీవ శరణ్య! మీదృష్టి నన్ సోకె - నైనవి నాభూషణావళు లింక
నేను గృతార్ధుండ! యేను ధన్యుండ - నేను మీభృత్యుండ; నెలమితోడుతను”
నని పల్కి "హనుమంతుఁ డను పేరివాఁడ- నినతనూజుని మంత్రి నే వాయుసుతుఁడ
నాంజనేయుఁడ భిక్షుకాకృతి నిపుడు - నంజక మీచంద మరయ వచ్చితిని.
వినుఁడు సుగ్రీవుఁడు విశ్రుతకీర్తి - వనచరులకు రాజు వరబలాధికుఁడు
భానుసూనుఁడు బృహద్భానుతేజుండు - మానభూషణుఁ డసమానవిక్రముఁడు
అన్న యౌవాలిచే నపహృతరాజ్య - ఖిన్నుఁడై యిప్పు డిగ్గిరి నున్నవాఁడు
ఆర్తుఁడు మీసఖుఁడై యుండఁ జేయ నేర్తు" నావుఁడు రామనృపుచిత్త మెఱిఁగి
కరమర్థి రామలక్ష్మణులకు మ్రొక్కి - కరములు ముకుళించి కడుభక్తిఁ బలికె.100
నవని నింద్రోపేందు లర్ధి నశ్వినులు - రవిచంద్రు లన రూపరమ్యతతోడ
నెగుబుజంబులతోడ నిందుబింబంబు - నగుమొగంబులతోడ నళినపత్రములఁ
దెగడుకన్నులతోడ దివిజులు మెచ్చి - పొగడు విక్రమకళాభుజశక్తితోడ
నరుదైన రాజచిహ్నములతో మీఱు - వరచాపహస్తులై వచ్చినవారు
భూరితపోవేషములు మీకు నేల? - మీ రెవ్వ? రిచటికి మీరు రానేల?”
యని సుధామధురవాక్యంబుల నధిక - వినయధేయుఁడై విన్నవించుటయు
నతనివాక్శుద్ధికి నతనిబుద్ధికిని - నతనిచమత్కృతి కతనియాకృతికి
నతనిమనఃప్రీతి కతనినీతికిని - మతి సంతసిల్లి రామక్షితీశ్వరుఁడు
దమ్మునిఁ జూచి “యాతని నట్లు పలుక - దమ్మిచూలికిని నాతనివధూమణికిఁ
దగుఁ గాన నొరులకుఁ దరమె వ్యాకరణ - నిగమశాస్త్రంబు లన్నియు నేరఁబోలు;110
నితనిసల్లాపంబు లితనిరూపంబు - నతులలక్షణలక్షితానురూపంబు.
ఇటువంటిదూత నా కిపు డబ్బెనేని - ఘటియింపకున్నె మత్కార్యంబులెల్లఁ?
గావున మత్కార్యగతు లీతనికిని - గోవిదాత్మక! పూసగూర్చినరీతిఁ
జెప్పు మేర్పడ” నన్న శ్రీరాముతమ్ముఁ - డప్పుడు ప్రియమంది హనుమంతుఁ జూచి
”మే మన్నదమ్ముల మిక్ష్వాకుకులుల - మీమహాత్ముఁడు రాముఁ డేను లక్ష్మణుఁడ
దశరథరాజనందనుల మిద్దఱము - దశరథుపనుపునఁ దపసులై వచ్చి
దండకావనమునఁ దవిలి వర్తించు - చుండ రామునిదేవి నుర్వీతనూజ
మఘు డాఁగురించి దుర్మదుఁడు రావణుఁడు - క్రమ మేది కొనిపోయెఁ గపటమార్గమున
వానిపోయినజాడ వదలక వెదకి - కానలనడుమ నొక్కట వచ్చి వచ్చి
శబరి సుగ్రీవునిచరితంబు చెప్పఁ - బ్రబలుఁ డాతఁడు మాకు బంటుగాఁ గోరి120