పుట:Ranganatha Ramayanamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“విలు పూని యిద్దఱు వివిధశస్త్రాస్త్ర - కలితులై యదె పంపకడ నున్నవారు
వినుఁ డిందుఁ బ్రచ్ఛన్నవేషులై వాలి - పనుపున మనలఁ జంపఁగ వచ్చినారు
కాదేని మునులకు ఖడ్గతూణీర - కోదండశరముల గొడవ యేమిటికి?60
వినుఁడు పావను లైన వీరివేషములుఁ - గనుఁగొని నాబుద్ధి గలఁగుచున్నదియు
నెక్కడి కైనను నేగుట కార్య - మిక్కడ నుండుట యిది బుద్ధి గాదు”
అనుచు మంత్రులతోడ నాడువాక్యములు - విని హనుమంతుండు విమలుఁడై పలికె.
‘‘పూని వీరలఁ జూడఁ బుణ్యమానసులు - గాని కానేరరు కపటమానసులు.
ఆరవిచంద్రులో యన నొప్పు వీరు - కారుణ్యపురుషులు కడు విచారింప
నేరూపమున వచ్చి యిందున్నవారొ? - వీరిపెం పెఱుఁగక వెఱవ నేమిటికి?"
ననిన సుగ్రీవుఁడు హనుమంతుఁ జూచి - విను వాలిపనుపున వీర లిచ్చటికిఁ
జనుదెంచి రనుశంక జనియించెఁ గానఁ - గినిసి యేవేళ నేకీ డెంచునొక్కొ?
తనపగతుని నమ్మఁదగ దటుఁ గానఁ - జని నీవు వారలఁ జతురతఁ గదిసి
వీ రేల వచ్చిరో? వీరి లోఁ తెఱిఁగి - వీరితో భాషించి వేవేగ వచ్చి70

శ్రీరాములవద్దికి హనుమంతుఁడు వచ్చుట

పవనజ! నాలోని భయమెల్ల మాన్పు" - మవిరళగతి నేగు మని వీడుకొలిపి
యలమెడుభీతిమై నందుండ వెఱచి - మలయాద్రి కటు వోయె మంత్రులు దాను.
అత్తఱి హనుమంతుఁ డతిశౌర్యవంతుఁ - డుత్తమగుణశీలుఁ డురుబాహుబలుఁడు
ఖరకరతేజుండు కమనీయమూర్తి - తరుచరులకురక్ష ధర్మార్థమోక్ష
యతులకు గురుభక్తి యభినవయుక్తి - శ్రుతకీర్తి యంజనాసుతుఁడు తా వేడ్క,
నమరలోకమునకు నావాలిఁ బనుప - రమణమై సుగ్రీవురాజ్యంబు నిలుప
వావిరి సురులను వరభక్తిఁ బ్రోవ - రావణు జయలక్ష్మి రామున కొసఁగ
నవనిజఘనశోక మంతయు మాన్ప - రవిసూను మనసెల్ల రాణింపఁజేయ
వచ్చెనో? యనఁగ నవ్వనచరేశ్వరుఁడు - అచ్చుగా నాగిరి నల్లన డిగ్గి
వటువేషధారియై వాయునందనుఁడు - అటు పంపకడకుఁ దా నర్థితోఁ బోయి80
యనుపమంబగు శూన్యహస్తంబుతోడ - జని మహాత్ములఁ గానఁ జన దటుగాన
నలరామునకు నియ్య నర్హ మైనట్టి - ఫల మొక్క టపుడు చేపట్టి వేడుకను
అరుదెంచు ననిలజు నపుడు తాఁ జూచి - ధరణీశుఁ డిట్లనె తమ్మునితోడఁ
గనకపువన్నెయుఁ గరమొప్పుముంజి - ఘనరత్నకుండలకలితకర్ణములు
నురుతరహారంబు లొంటిజన్నిదము - కరమొప్పు గోచియుఁ గరకంకణములు
నుపమింప నరుదైనయొప్పుల నొప్పు - గపిరూపు మనుజుఁడు గైకొనె నొక్కొ?
ఈరూపురేఖయు నిలఁ గోరి రుద్రుఁ - డారూఢిగా నితఁడై పుట్టినాఁడొ?
గాక యీవసుధపైఁ గపిమాత్రమునకుఁ - బ్రాకటంబుగ శుభప్రభ యేల గలుగు?"