పుట:Ranganatha Ramayanamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీరంగనాథరామాయణము

కిష్కింధాకాండము



శ్రీరాముఁ డయ్యెడ శీతలవారి - వారిజోత్పలకైరవంబుల నొప్ప
పంపయు మధుమాసఫలితతత్తీర - చంపకసహకారచారుకాంతార
సంపదయును జూచి జానకీవిరహ - కంపితుం డగుచు లక్ష్మణున కిట్లనియె.
"సౌమిత్రి! యీపంప సకలనిలింప - కామినుల్ జలకేళి కరము గాంక్షింప
నొప్ప నీసరసితో నుపమాన మరసి - చెప్పంగ శక్యమే శేషాహికైన?
ననుకూలమలయానిలాహతి దీన - జనియించుఁ బో బిందుసరము లెన్నైన
దీనిమహత్త్వంబు దెలిసినచోట - మానసంబును నణుమాత్రంబు గాదె?
పావనజీవనాస్పద మైన దీని - కావేల్పుడిగ్గియ యైన సమంబె?
యున్నాళికస్ఫురితోరుకర్ణికల - దిన్నగా విరిసిన తెల్లనెత్తమ్మి
మరకతస్తంభనిర్మలహేమకుంభ - భరితాతపత్రమై పార్శ్వద్వయమునఁ 10
దేటిఱెక్కలఁ గ్రమ్ము తెమ్మెరవలన - నూటాడుతరగల నుయ్యాల లూగు
విప్పారు ఱెక్కల వెలయు రాయంచ - లొప్పారఁగా వైచు నుభయచామరము
లింపొంద నీపంప యీక్షింప నొప్పె - శ్రీపూర్ణపట్టాభిషిక్తునికరణి
నామని జవ్వనం బలరినరుచుల - చేమించు చిన్నారిచిగురు మానికపు
సొమ్ములు దాల్చుచుఁ జట్టును గ్రమ్మి - కొమ్మ లీనిద్దంపుకొలఁకుదట్టమున
నిక్కి నీడలు చూచి నిజవిలాసముల - కొక్కింతయౌదల లూఁచుచoదమునఁ
గొండొకగాలిసోఁకుల తుద ల్గదల - నొండొరుఁ బొగడుచు నున్నచందమునఁ
గీరశారిక లర్థిఁ గెరలు నిచ్చోటి - తీరవనీవాటి దృష్టింప నిపుడు
తాపంబు మరునిప్రతాపంబు కరణి - దీపించె నామేన ధృతి నటు గాన
సౌమిత్రి! యిది వనస్థలి గాదు చూడఁ - గామునియాయుధాగారంబు గాని20
చింతింప నివి మావిచిగురులు గావు - కంతుని క్రొవ్వాడికత్తులు గాని,
భావింప నివి పూవుబంతులు గావు - భావజాతుని వాడిబాణముల్ గాని,
యీయెడ భృంగఝంకృతు లివి గావు - డాయుమన్మథుచాపటంకృతు ల్లాని.
వర్ణింప నివి పికధ్వనులు గా వతను - కర్ణకఠోరహంకారము ల్గాని,
యటు గాన నావంటి యంగనారహితు - లెటువలె వేగింతు రీకాననమునఁ?