పుట:Ranganatha Ramayanamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బనిబూని యరిగండభైరవుపేర - ఘనుపేర మీసరగండనిపేర
నాచంద్రతారార్క మై యొప్పు మిగిలి - భూచక్రమున నతిపూజ్యమై వెలయు
నసమానలలితశబ్దార్థసంగతుల - రసికమై చెలువొందు రామాయణంబు
పరఁగ నలంకారభావన ల్నిండఁ - గరమర్థి నయ్యోధ్యకాండంబుఁ జెప్పె
నారూఢి నార్షేయ మై యాదికావ్య - మై రసికానంద మై యలనాఁడు1750
నివ్వసుమతి నొప్పు నీపుణ్యచరిత - మెవ్వరు చదివిన నెవ్వరు వినిన
సామాదిబహువేదచయధామరామ - నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారముల్ ప్రభువిచారములు - పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు - ధర్మైకనిష్ఠలు దానాభిరతులు
ఆయురారోగ్యంబు లైశ్వర్యములును - బాయని శుభమును పాపక్షయంబు
వరపుత్త్రలబ్ధియు వైరినాశనము - సరినొప్పు ధనధాన్యచయసమృద్ధియును
నేవిఘ్నములు లేక నిండ్లలో నధిక - లావణ్యయుతులైన లలనలపొందు
కొడుకులతో నెప్డు గూడియుండుటయు - నెడగాక నాపద లెల్లఁ బాయుటయు
సమ్మదంబున బంధుజనులఁ గూడుటయు - నిమ్ములఁ గామ్యంబు లెపుడుఁ గూడుటయు
సతతంబు దేవతాసంతర్పణంబు - పితృగణతృప్తియుఁ బెంపారుచుండు1760
నిది మోక్షసాధనం బిది పాపహరము - ఇది దివ్య మిది భవ్య మిది శ్రీకరంబు
వ్రాసినవారికి వరశుభోన్నతులు - వాసవభోగాదివాసులఁ జేయు
నెందాఁక కులగిరు లెందాఁక తార - లెందాఁక రవిచంద్రు లెందాఁక దిశలు
ఎందాఁక వేదంబు లెందాఁక ధరణి - యెందాఁక భువనంబు లేపు దీపించు
నందాఁక యీకథ యక్షతానంద - సందోహదోహళాచారమై పరఁగు.1765

అయోధ్యాకాండము సంపూర్ణము

————