పుట:Ranganatha Ramayanamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నామాట లాలింపు నాపంపుమీఁద - భూమికిఁ బతి గమ్ము పురి కింకఁ బొమ్ము.”
అనిన రావణుఁ డింక నాజిలోఁ గూలు - నని నిశ్చయముఁ జేసి రందున్నమునులు.
సురలు దిగ్వరులు భాసురధర్మనిరత - భరత! రామునిమాట పాటింపు మనిరి.

జాబాలి యనుముని శ్రీరామునకు హిత ముపదేశించుట

యప్పుడు జాబాలి యనుమౌని రాముఁ - దప్పక కనుఁగొని తగవేది పలికె.
“రామ! యి దేమి నిరర్థకబుద్ధి - నేమించి మునిపోలె నృపవేష ముడిగి
రాజోపభోగమౌ రాజ్యంబు విడిచి - యీజాడ నుండుట కేమి కారణము?
యెక్కడి తలిదండ్రు? లెక్కడి సత్య? - మెక్కడి సుతధర్మ? మిది యెల్ల కల్ల;
తలిదండ్రు లొండొరుల్ తమసౌఖ్యమునకు - కలయుచో శుక్లరక్తము లైక్య1690
యోజఁ బిండాకృతి నుదయించె నరుఁడు - బీజమాత్రము తండ్రి పెక్కులై యింక
నిమురుక నారిపోయినదీపమునకుఁ - జమురు వోసినయట్టు చచ్చినయట్టి
వారికిఁ బరలోకవైదికకర్మ - మూరక జనులు సేయుటయు వ్యర్థంబు,
గావున నామాట గైకొని రామ! - నీ వయోధ్యకు వచ్చి నృపుఁడవై యుండు."
మని యిట్లు జాబాలి యాడువాక్యములు - విని కోపమున రఘువీరుఁ డిట్లనియె.
“నిట్టి నాస్తికబుద్ధి యెవ్వరి కైనఁ - బట్టి బోధింపు జాబాలి మునీంద్ర
మాకు మాపెద్ద లేమర్యాద నడచి - రాకైవడి మెలంగ నదియె సమ్మతము.
సత్యమూలంబులు సకలధర్మువులు - సత్యంబుకంటె నెంచఁగ ధర్మ మెద్ది?
యట్టిసత్యము దప్ప కనఘ! మాతండ్రి - పట్టినధృతి నన్నుఁ బనిచెఁ గానలకుఁ;
గాన నాతనియాజ్ఞ గడచినఁ బుణ్య - హీనుండు నాకన్న నితరుండు గలఁడె?1700
సత్యంబు ధర్మంబు శమమును దమము - నిత్యభూతదయయు నీతివిక్రమము
ప్రియవాక్యమును దేవపితృప్రపూజనము - రయ మొప్ప స్వర్గమార్గము లండ్రు బుధులు
ఇవి యెల్లఁ గల్లగా నీవు బోధించి - తవు నవు నీ వెట్టి యగ్రజన్ముఁడవు?
ని న్ననఁ బని యేమి? నిన్ను నాస్తికుని - మన్నన నరసిన మాతండ్రి ననుట”
యని రామవిభుఁ డాడునట్టి వాక్యములు - విని ప్రీతి జాబాలి వెండియు ననియె.
“నన్ను నాస్తికునిగా నరనాథచంద్ర! - యెన్ని తయోధ్య కెట్లేని విచ్చేసి
భూమి యేలుదు వను బుద్ధి నిట్లంటి - రామ! యోర్వు" మటంచుఁ బ్రార్థన చేసె.
నంత వసిష్ఠసంయమి సూర్యవంశ - మంతయు నిక్ష్వాకుఁ డాదిగా నెన్ని.
“యనఘ! మీకులమున నగ్రజు లుండ - ననుజుండు రా జౌట నరసిన లేఁడు;
కావునఁ బెద్దలక్రమమున నీవు - భూవలయం బెల్లఁ బూనుట లెస్స1710
యెంతైనఁ బితృవాక్య మే దాఁట ననుచు - నింతగా నీశ్చయం బిట్టిద యేని?
యాదట నినుఁ గొల్చినట్ల నీదైన - పాదుకాయుగళంబు భరతుండు గొలిచి
నెమ్మది నుండెడు నీపాదుకంబు - లి”మ్మన్నఁ దల్లులు హితులు నాశ్రితులు